చిత్రం చెప్పే విశేషాలు

(11-01-2024/1)

నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా ఎక్కడచూసినా చీరలు చుట్టిన పంటచేలు దర్శనమిస్తాయి. దిలావర్‌పూర్‌ మండలం లోలం గ్రామంలోని మొక్కజొన్న పంటకు కంచెలా వివిధ వర్ణాల్లో కనువిందు చేస్తున్న ఈ చీరలు గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు కావడం గమనార్హం.

ఇక్కడ దస్త్రాలతో కనిపిస్తున్నది అల్మారా కాదు.. గత మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్‌ పురపాలక సంఘం కార్యాలయంలో రూ. లక్ష వెచ్చించి కొనుగోలు చేసిన జిరాక్స్‌ యంత్రం. అందులో కొన్ని పరికరాలు పని చేయకపోవడంతో మూలన పడేశారు.

అందాలకు నెలవు. నిత్యం పచ్చదనంతో ఈ ప్రాంతం అలరిస్తోంది. ఒంపు సొంపుల మార్గంలో రహదారులు నిర్మిస్తున్నారు. రంగబయలు పంచాయతీలో  కొసంపుట్టుకు రహదారి నిర్మాణం జరుగుతోంది. ఈ మార్గం ఇప్పుడు విహంగ వీక్షణంలో చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది.  

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో చూడముచ్చటైన రంగురంగుల చిత్రాలు, శిల్పాలు కొలువుదీరాయి. చిత్రకారులు తమ ఆలోచనలకు అద్దంపడుతూ కాన్వాస్‌పై మలిచిన పెయింటింగ్‌లు కళాప్రియులను ఆకట్టుకుంటున్నాయి. శిల్పాలు కనువిందు చేస్తున్నాయి.

ఈ చిత్రం చూడండి.. ఎవరో కొందరు వనభోజనం చేస్తున్నట్టుంది కదూ.. కానీ అక్కడ ఉన్నది రోజువారి వ్యవసాయ కూలీలు. గుర్రంపోడు మండలం కాల్వపల్లి సమీపంలో బుధవారం కొందరు శ్రామికులు మిరపకాయలు ఏరేందుకని వచ్చి ఇలా సామూహిక భోజనం చేస్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

సంక్రాంతికి ఊరెళ్లేందుకు నగరవాసికి కష్టాలు తప్పడం లేదు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, జూబ్లీ, ఎంజీబీఎస్‌ బస్టాండ్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు రైళ్లు, బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు.  

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రచార రథాలకు ఏర్పాటు చేసిన ఇనుప ఫ్రేంలను తొలగించి వచ్చే పార్లమెంటు ఎన్నికలకు భద్రపరిచారు. ఉప్పరపల్లి నలందానగర్‌ కాలనీలోని ఓ కార్ఖానా ఎదుట కనిపించిందీ చిత్రం. 

హనుమంతునిపాడు చుట్టుపక్కల మినుము, మిరప కోతలు జరుగుతున్న నేపథ్యంలో.. ఒక్కో ఆటోలో ఇరవైమందికి పైగా కూలీలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. వారంతా కనిగిరి, మార్కాపురం, కొనకనమెట్ల, వెలిగండ్ల ప్రాంతాలకు వెళుతున్నారు.

వీటిని చూస్తుంటే మంచు పర్వతాల్లా కనిపిస్తున్నాయి కదూ.. ఇది మంచు కాదు.. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని ఓ జిన్నింగ్‌ మిల్లులోని పత్తి. రైతుల నుంచి సీసీఐ కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసింది. ఈ మిల్లు పరిధిలో రోజూ 800 నుంచి 1000 క్వింటాళ్ల వరకు కొనుగోలు జరుగుతాయి. 

లేజర్‌ బేస్‌డ్‌ హోమ్‌ సెక్యూరిటీ : అర్డినోబోర్డు నుంచి వచ్చే సంకేతాలను ఎల్‌డీఆర్‌ పరికరం గ్రహించి లేజర్‌ డయోడ్‌ని స్పందింపజేసి యజమానికి సమాచారం ఇస్తుంది. ఎవరైనా లేజర్‌లైట్‌ను తాకగానే శబ్దం రావడంతో ఇంటి ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చినట్లు వెంటనే గుర్తించవచ్చు.

చిత్రం చెప్పే విశేషాలు(25-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

Eenadu.net Home