ఈ నైపుణ్యాలు మీ సొంతమైతే.. కెరీర్‌లో తిరుగుండదు!

అసలే పోటీ ప్రపంచం. ఇష్టమైన కొలువులు సాధించడం, దాంట్లో రాణించడం అంత ఈజీ కాదు. అందుకే కెరీర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలంటే ప్రతి విద్యార్థీ కొన్ని సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోవాల్సిందే..

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

సమర్థమైన కమ్యూనికేషన్‌ నైపుణ్యం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఒక ఆలోచనను, అభిప్రాయాన్ని అవతలి వ్యక్తికి చెప్పి ఒప్పించగలిగేలా మౌఖిక/ రాతపూర్వకమైన స్కిల్స్‌ను అలవర్చుకోవాలి. 

ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

సంక్లిష్ట పరిస్థితుల్ని విశ్లేషించే సత్తా, సవాళ్లను గుర్తించి వినూత్న పరిష్కారాలను చూపే నైపుణ్యాల్ని అలవర్చుకోవాలి.

లీడర్‌షిప్‌ 

నాయకత్వ లక్షణాలుంటే టీమ్‌లను సమర్థంగా నిర్వహించగలరు. తోటి సభ్యులకు స్ఫూర్తినిస్తూనే అనుకున్న లక్ష్యం వైపు వారిని నడిపించే సమర్థతను పెంపొందించుకోవాలి. 

టీం వర్క్‌

సమష్టి లక్ష్యాల్ని సాధించేందుకు పరస్పర సహకారం, టీమ్‌ వర్క్‌ చాలా అవసరం. విభిన్న వ్యక్తులతో సహకరించుకుంటూ పనిచేసే నేర్పు, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకుంటూనే.. బృంద స్ఫూర్తితో పనిచేయడం అలవాటు చేసుకోవాలి.

డెసిషన్‌ మేకింగ్‌

ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనేటప్పుడు తొందరపడొద్దు. కంగారుపడటం, అలజడికి గురవడం చేయొద్దు. ప్రతిదీ తర్కించి, లాభనష్టాలు బేరీజు వేసి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి.

క్రిటికల్‌ థింకింగ్‌

ఏ పని చేసినా మనం లేకపోతే ఇంకెవరూ ఇంత సమర్థంగా చేయలేరనిపించేలా ఉండాలి. క్రిటికల్‌ థింకింగ్‌ను అలవర్చుకోండి. ఏదైనా సమాచారాన్ని విమర్శనాత్మకంగా చూడటం, ప్రశ్నించేతత్వంతో మిమ్మల్ని మరింత మెరుగుపరుచుకోండి.

టైం మేనేజ్‌మెంట్‌

ఉన్న కొద్ది సమయాన్నే సమర్థంగా నిర్వహించుకోవడం నేర్చుకోండి. ప్రాధాన్యత క్రమంలో పనులు చేసుకుంటూ అనుకున్న సమయానికే మీ లక్ష్యాల్ని పూర్తి చేసుకోగలగాలి. 

అడాప్టబిలిటీ 

ఎలాంటి పరిస్థితులకైనా ఒదిగిపోయే తత్వం మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ప్రపంచమే శరవేగంగా మారుతున్న వేళ భిన్నమైన పరిస్థితులకు నిలబడగలిగే నైపుణ్యాలు అలవర్చుకోవడం ఎంతో అవసరం. 

భావోద్వేగాల అదుపు

మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని అవతలివారిని అర్థం చేసుకొనే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. తద్వారా ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు నెరపగలగుతారు. 

ఒత్తిడిని తట్టుకోవడం

వచ్చే ప్రాజెక్టులన్నీ దాదాపు సవాళ్లతో కూడినవే ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో సమర్థంగా పనిచేయడం ఒకటైతే.. ఒత్తిడిని తట్టుకొని అనుకున్న సమయానికే పనుల్ని చక్కబెట్టే నైపుణ్యం మీ సొంతమైతే కెరీర్‌లో ఇక మీకు ఎదురుండదు.

సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

Eenadu.net Home