ఏ రోజు.. ఏ బతుకమ్మ..!
ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైనది. తెలంగాణలో తొమ్మిది రోజులపాటు పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఇంతకీ ఏ రోజు.. ఏ బతుకమ్మను పేరుస్తారో తెలుసుకుందాం రండి.
Image:Eenadu
ఎంగిలిపూల బతుకమ్మ
ఈ పండుగ మహాలయ అమావాస్యతో ప్రారంభమవుతుంది. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి వంటి పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడతారు. ఇలా తొలిరోజున పేర్చిన బతుకమ్మను 'ఎంగిలిపూల బతుకమ్మ'గా పిలుస్తారు.
Image:Eenadu
అటుకుల బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యమి నాడు 'అటుకుల బతుకమ్మ' జరుపుకొంటారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు.. వంటి పదార్థాలను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
Image:Eenadu
ముద్దపప్పు బతుకమ్మ
బతుకమ్మ ఆటలో మూడో రోజైన విదియ నాడు అమ్మను 'ముద్దపప్పు బతుకమ్మ'గా కొలుస్తారు. మహిళలంతా ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు.. మొదలైన పదార్థాలను అమ్మకు నివేదన చేస్తారు.
Image:Eenadu
నానబియ్యం బతుకమ్మ
బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజుని 'నానబియ్యం బతుకమ్మ'గా పేర్కొంటారు. నానేసిన బియ్యం, పాలు, బెల్లం.. వంటి అమ్మకు ప్రీతిపాత్రమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
Image:Eenadu
అట్ల బతుకమ్మ
ఐదో రోజున బతుకమ్మను 'అట్ల బతుకమ్మ' అంటారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. అలాగే బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ ఈ అట్లను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.
Image:Eenadu
అలిగిన బతుకమ్మ
బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజున అమ్మవారిని 'అలిగిన బతుకమ్మ'గా పిలుస్తారు. చాలాచోట్ల దీన్ని 'అర్రెం'గా కూడా పేర్కొంటారు. ఈ రోజున బతుకమ్మ ఆడరు. ఎలాంటి నైవేద్యం కూడా తయారు చేయరు.
Image:Eenadu
వేపకాయల బతుకమ్మ
బతుకమ్మ ఆటలో ఏడో రోజున అమ్మవారిని 'వేపకాయల బతుకమ్మ'గా పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నివేదన చేస్తారు.
Image:Eenadu
వెన్నముద్దల బతుకమ్మ
బతుకమ్మ సంబరాల్లో ఎనిమిదో రోజున అమ్మను 'వెన్నముద్దల బతుకమ్మ' అని పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం.. వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
Image:Eenadu
సద్దుల బతుకమ్మ
ఆశ్వయుజ మాసంలో ఎనిమిదో రోజైన దుర్గాష్టమి నాడు 'సద్దుల బతుకమ్మ' పండగను నిర్వహిస్తారు. దీన్ని 'పెద్ద బతుకమ్మ' అని కూడా పిలుస్తారు. ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ.. ఇలా రెండు బతుకమ్మలను పేర్చుతారు.
Image:Eenadu
సద్దుల బతుకమ్మ రోజు పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి.. ఇలా ఐదు రకాల సద్దులను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో తొమ్మిది రోజుల పాటు కొనసాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.
Image:Eenadu