టెంపరరీ ఈమెయిల్ కావాలా? ఇవి ట్రై చేయండి
ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏ సేవలు పొందాలన్నా లాగిన్ కోసం సంస్థలు ఈ-మెయిల్ ఐడీని అడుగుతుంటాయి. మీ మెయిల్ ఐడీ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఉచితంగా టెంపరరీ మెయిల్‌ఐడీలు అందించే సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని... అవసరమైతే ట్రై చేసి చూడండి.
టెంప్ మెయిల్ (Temp Mail)
ఈ తాత్కాలిక మెయిల్ సేవలను సులభంగా వినియోగించుకోవచ్చు. మీకోసం ఇది ఓ మెయిల్ ఐడీని సృష్టించి ఇస్తుంది. పది నిమిషాల తర్వాత ఆ మెయిల్ ఐడీ, మెయిల్స్ మాయమవుతాయి.
గొరిల్లా మెయిల్ (Guerrilla Mail)
ఎలాంటి సైన్‌ఇన్ లేకుండానే ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన పేరుతో ఓ మెయిల్ ఐడీని సృష్టించుకోవచ్చు. వీటికి వచ్చే మెయిల్స్ మీరు డిలీట్ చేసే వరకు ఉంటాయి. ఈ టెంపరరీ మెయిల్ నుంచి ఇతరులకు మెయిల్ పంపే అవకాశముంది.
10 మినిట్ మెయిల్ (10 Minute Mail)
కొన్ని నిమిషాల కోసం మీకు మెయిల్ ఐడీ కావాలనుకుంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సైట్ ఓపెన్ చేయగానే మీ కోసం ఓ మెయిల్ ఐడీని సృష్టిస్తుంది. పది నిమిషాల తర్వాత ఈ మెయిల్ ఐడీ, దీనికి వచ్చిన మెయిల్స్ ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతాయి.
ఈమెయిల్ ఆన్ డెక్ (EmailOnDeck)
ఈ సైట్ ఓపెన్ చేయగానే ‘ఐయామ్ హ్యుమన్’ క్యాప్చాను పూర్తి చేయాలి. ఆ తర్వాత ‘గెట్‌మెయిల్’పై క్లిక్ చేస్తే తాత్కాలిక మెయిల్ ఐడీ కనిపిస్తుంది. కొన్ని గంటల తర్వాత ఐడీ, మెయిల్స్ డిలీట్ అయిపోతాయి.
త్రో అవే మెయిల్ (ThrowAwayMail)
చాలా సులభంగా ఉండే మెయిల్ సర్వీస్ ఇది. సైట్ ఓపెన్ చేసి ‘క్లిక్ హియర్ టు షో యువర్ ఈమెయిల్’పై క్లిక్ చేస్తే సరి. ఈ తాత్కాలిక మెయిల్ ఐడీ 48 గంటల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుంది.
మెయిల్‌డ్రాప్ (Maildrop)
ఇందులో మీరే సొంతంగా ఒక మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. కేవలం 500 కేబీ అంతకంటే తక్కువ సైజ్ మెయిల్స్ మాత్రమే వస్తాయి. అంతకుమించి కంటెంట్ ఉంటే అవి మెయిల్‌లో కనిపించవు. 24 గంటల్లోపు దీనికి మెయిల్స్ రాకపోతే ఆటోమెటిక్‌గా ఐడీ డిలీట్ అయిపోతుంది.
బర్నర్ మెయిల్ (Burner Mail)
ఈ సేవలు వినియోగించుకోవాలంటే సైనప్ కావాల్సి ఉంటుంది. 5 తాత్కాలిక మెయిల్స్‌ను ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. 7 రోజుల వరకు వీటికి వచ్చే మెయిల్స్ కనిపిస్తాయి.
మొహ్‌మాల్ (MohMal)
సైనప్‌తో పనిలేదు. సైట్ ఓపెన్ చేసి.. ర్యాండమ్‌గా లేదా నచ్చిన మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. ఇది కేవలం 45 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. రిఫ్రెష్ చేయడం ద్వారా మెయిల్ సమయాన్ని పొడిగించుకోవచ్చు.
గెట్‌నాడా (GetNada)
సైట్ ఓపెన్ చేయగానే తాత్కాలిక మెయిల్ ఐడీ ఉంటుంది. దానికి వచ్చే మెయిల్స్ కింద కనిపిస్తాయి. కొంత సమయానికి ఆ మెయిల్స్ డిలీట్ అవుతాయి. లేదా మీరే డిలీట్ చేసుకోవచ్చు.
మెయిల్ పూఫ్ (Mail Poof)
దీంట్లో ఆటోమెటిక్‌గా మీకోసం మెయిల్ ఐడీ క్రియేట్ చేసి ఇస్తుంది. లేదా మీకు నచ్చినట్టుగా మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. 24 గంటల తర్వాత దీనికి వచ్చే మెయిల్స్ అన్నీ డిలీట్ అవుతాయి.