వేసవి కాలం విహారయాత్ర.. కొత్తగా!

పిల్లల పరీక్షలు పూర్తి కావొస్తున్నాయి. మరి వేసవి సెలవుల్లో కుటుంబమంతా విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారా? కొత్తగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఈ ప్రాంతాలపై ఓ లుక్కేయండి..

తవాంగ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉంది. ఇక్కడి జలపాతాలు, నదులు, సెలా పాస్‌, బౌద్ధ సన్యాసుల ఆశ్రమాలు కొత్త అనుభూతిని ఇస్తాయి. అక్కడికి చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు లేవు. కానీ, వెళ్తే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు పొందొచ్చు.  

పెల్లింగ్‌

సిక్కింలో ఉన్న ఈ ప్రాంతం నుంచి హిమాలయ పర్వతాలు, రింబి నది, జలపాతం అందాలను వీక్షించొచ్చు. బైకింగ్‌, ట్రెక్కింగ్‌, విలేజ్‌ టూర్‌ బాగుంటాయి. ఇక్కడి డారప్‌ గ్రామంలో వివిధ తెగలకు చెందిన ప్రజలు టూరిస్టులకు అతిథ్యమిస్తారు. 

కుర్సెయాంగ్‌

పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌కు 32 కి.మీ దూరంలో ఉండే చిన్న హిల్‌స్టేషన్‌ ఇది. హిమాలయ పర్వతాల అందాలు, టీ తోటలు కనువిందు చేస్తాయి. ఇక్కడి డీర్‌ పార్క్‌, నేతాజీ మ్యూజియం, జలపాతాలు పిల్లల్ని ఆకట్టుకుంటాయి.

మహాబలేశ్వరం

మహారాష్ట్రలోని ఈ హిల్‌ స్టేషన్‌.. మల్‌బెర్రీస్‌, రస్బెర్రీస్‌, గూస్‌బెర్రీస్‌ సాగుకు పెట్టింది పేరు. ఇక్కడి కొండల్లో ట్రెక్కింగ్‌ చేయొచ్చు. మహాబలేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించొచ్చు. వెన్నా సరస్సులో బోటింగ్‌ మంచి అనుభూతినిస్తుంది. 

నైనితాల్‌

ఉత్తరాఖండ్‌లో ఉందీ ప్రాంతం. ఇక్కడి ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన వాతావరణం టూరిస్టుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పారా , ట్రెక్కింగ్‌, బోటింగ్‌, టిబెటియన్‌ మార్కెట్లో షాపింగ్‌ చేయొచ్చు.  

ఖజ్జియర్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాన్ని భారతీయ ‘మినీ స్విట్జర్లాండ్‌’గా పిలుస్తారు. ఈ ప్రాంతం మధ్యలో ఉండే సరస్సు, ఎటుచూసినా పచ్చదనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడి ఖజ్జియర్‌ సాంక్చరీని తప్పకుండా సందర్శించాల్సిందే. 

వాగమాన్‌

కేరళలో ఉంది. పచ్చికబయళ్లు, అడవులు, ఎత్తయిన ప్రాంతాల కలయికతో ఎంతో సుందరంగా ఉంటుంది. మరమాల, వాగమాన్‌ జలపాతాలు.. ఉలిపూని వైల్డ్‌లైఫ్‌ సాంక్చరీ ఆకట్టుకుంటాయి. బోటింగ్‌, పారాగ్లైడింగ్‌ చేయొచ్చు. 

పోర్ట్‌బ్లెయిర్‌

అండమాన్‌ నికోబార్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌లో ఉన్న బీచ్‌లు, షాపింగ్‌ వీధులు, సముద్రిక మెరైన్‌ మ్యూజియం సందర్శించదగ్గ ప్రాంతాలు. ఇక సెల్యూలర్‌ జైలు, బ్రిటీష్‌కాలం నాటి నిర్మాణాలు చరిత్రను కళ్లముందు ఉంచుతాయి. 

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home