కేన్స్‌లో బ్యూటిఫుల్‌ షార్క్‌

సాధారణంగా కేన్స్‌ చిత్రోత్సవాల్లో సినిమాలకు సంబంధించిన వ్యక్తులే ఎక్కువగా కనిపిస్తారు. ఈ సారి భారత్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త అక్కడ సందడి చేశారు. ఆమెనే.. నమితా థాపర్‌.

‘షార్క్‌ ట్యాంక్‌’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువైన నమిత.. 47 ఏళ్ల వయసులోనూ మోడ్రన్‌ లాంగ్‌ఫ్రాక్‌లో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. తెలియని వారు ఆమె గురించి నెట్టింట వెతుకుతున్నారు.

‘ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌’ సంస్థ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈమె.. ‘షార్క్‌ ట్యాంక్‌’ కార్యక్రమంలో షార్క్‌గా వ్యవహరిస్తున్నారు. అక్కడికి వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తల సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

వ్యాపారవేత్తగా తన వ్యాపారాల్ని చూసుకుంటూనే.. బుల్లితెరపై తన డ్రెస్సింగ్‌ స్టైల్స్‌, ట్రెండీ లుక్స్‌తో ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలుస్తున్నారు. తన డ్రెస్సింగ్‌పై వచ్చిన విమర్శలను దీటుగా ఎదుర్కొన్నారు. 

నమిత.. 1977 మార్చి 21న పుణెలో జన్మించారు. తండ్రి సతీశ్‌ మెహతా ‘ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌’ను స్థాపించారు. చిన్నతనం నుంచి చదువుల్లో ముందున్న ఈమె.. 21 ఏళ్ల వయసులోనే ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ పూర్తిచేశారు.

ఆ తర్వాత నార్త్‌ కరోలినాలోని ‘డ్యూక్‌ యూనివర్సిటీ - ది ఫుఖా స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’లో ఎంబీఏ పూర్తిచేశారు. చదువు పూర్తయ్యాక అక్కడే మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో ఆరేళ్ల పాటు పనిచేశారు. 

భారత్‌కు తిరిగొచ్చాక తండ్రి సంస్థలోనే చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా చేరి.. ఇప్పుడు ఎండీ అయ్యారు. భారత ఫార్మారంగంలో ఒక అగ్రగామి సంస్థగా ‘ఎమ్‌క్యూర్‌’ను నిలపడంలో ఎంతో కృషి చేశారు.

అంతేకాదు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ‘అన్‌కండిషన్‌ యువర్‌సెల్ఫ్‌ విత్‌ నమిత’ పేరుతో యూట్యూబ్‌ టాక్‌ షో పెట్టి మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. 

‘ఇంక్రెడిబుల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ అనే మరో సంస్థను స్థాపించి.. 11-18 ఏళ్ల వయసున్న యువతకు వ్యాపార మెళకువలు నేర్పుతున్నారు. మహిళా వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపుతున్నారు. 

తన వ్యాపార దక్షతతో ‘వరల్డ్‌ విమెన్‌ లీడర్‌షిప్‌ కాంగ్రెస్‌ సూపర్‌ అఛీవర్‌ అవార్డు’తో పాటు పలు పురస్కారాలూ అందుకున్న నమిత.. ఫోర్బ్స్‌ వంటి జాబితాల్లోనూ చోటుదక్కించుకున్నారు.

ప్రస్తుతం నమిత నికర ఆస్తుల విలువ రూ. 600 కోట్లకు పైమాటే! అలాగే ‘ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌’ సంస్థ విలువ 3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు ఎదుర్కొని నిలిచిన నమిత.. వ్యాపారవేత్త వికాస్‌ థాపర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలున్నారు. వారి పేర్లు వీర్‌ థాపర్‌.. జై థాపర్‌. 

నమిత.. బాలీవుడ్‌ చిత్రాలకు, అమితాబ్‌ బచ్చన్‌కు పెద్ద ఫ్యాన్‌. పెళ్లికి ముందు ప్రతి సినిమాను రిలీజ్‌ రోజే చూసేవారట. తనకు బాగా నచ్చిన ‘షోలే’ చిత్రంలోని పాత్రల పేర్లే తన పిల్లలకు పెట్టినట్లు ఓ సందర్భంలో చెప్పారు.

క్రెడిట్‌ స్కోరు పెంచే 8 టిప్స్‌

యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను చూడాలంటే ఇలా చేయండి..

ఫ్రీడమ్‌ 125.. ప్రపంచంలోనే తొలి CNG బైక్‌

Eenadu.net Home