టపాసుల వెలుగులు దీపావళికే కాదు..!

మన దేశంలో దీపావళి పండగంటే బాణసంచా తప్పనిసరిగా ఉండాల్సిందే. మనం దీపావళిని టపాసులతో చేసుకుంటున్నట్లే.. పలు దేశాలు వివిధ సందర్భాల్లో బాణసంచాతో వేడుకలు నిర్వహిస్తాయి. ఆ దేశాలేవి? ఆ సందర్భాలేంటో చూద్దామా...!

అమెరికా

అగ్రదేశం అమెరికాలో ఏటా జులై 4న స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజున దేశవ్యాప్తంగా భారీగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు.

యూకే

గాయ్‌ ఫాక్స్‌ అనే వ్యక్తి అతని బృందం కలిసి నవంబర్‌ 5,1605న అప్పటి రాజు జేమ్స్‌1ను చంపడానికి విఫలయత్నం చేశారు. ఆ ఘటనను గన్‌పౌడర్‌ ప్లాట్‌గా పిలుస్తుంటారు. దీంతో ఏటా ఆ రోజును ‘గాయ్‌ ఫాక్స్‌ నైట్‌’గా చేసుకుంటూ బాణసంచా కాల్చుతారు.

చైనా

చైనావాసుల నూతన సంవత్సరం ఏటా జనవరి చివరివారంలో లేదా ఫిబ్రవరి మొదట్లో ఉంటుంది. చెడు తొలగిపోయి మంచి జరగాలని కోరుకుంటూ ఆ రోజు బాణసంచా కాలుస్తారు. 

జపాన్‌

జులై చివరి శనివారం జపాన్‌లోని అసాకుస జిల్లాతోపాటు మరికొన్ని చోట్ల ఫైర్‌వర్క్స్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. అందులో భాగంగా బాణసంచా పోటీలు పెడతారు. వీటిని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తుంటారు.

ఫ్రాన్స్‌

జులై 14న ఫ్రాన్స్‌వ్యాప్తంగా టాపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఆ రోజున 1789లో ఫ్రెంచ్‌ తిరుగుబాటుదారులు బాస్టిల్‌ కోటను ముట్టడించారు. ఫ్రెంచ్‌ తిరుగుబాటు కూడా అదే రోజు మొదలైంది. 

దుబాయి

నూతన సంవత్సరం రోజున దుబాయివ్యాప్తంగా బాణసంచా మోతమోగుతుంటుంది. టపాసుల వెలుగుల్లో అక్కడి భవనాలు అద్భుతంగా కనిపిస్తాయి.

కెనడా

జులైలో కెనడాలో మాంట్రియల్‌ ఇంటర్నేషనల్‌ ఫైర్‌వర్క్స్‌ పోటీలు నిర్వహిస్తారు. బాణసంచా తయారీ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంటాయి.

స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, హంగేరీ, ఆస్ట్రేలియా తదితర దేశాలు తమ నేషనల్‌ డేలో భాగంగా బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటాయి. 

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

Eenadu.net Home