జక్కన్న లైఫ్ మార్చిన క్వశ్చన్!
‘ఆర్‌ఆర్‌ఆర్’తో ‘ఆస్కార్’ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ) సాధించి, ప్రపంచమంతా తెలుగు చలన చిత్ర పరిశ్రమవైపు చూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు..
రాజమౌళిని జక్కన్న అంటుంటారనే సంగతి తెలిసిందే. మరి, స్కూల్ రికార్డుల్లో ఆయన పేరు ఏంటో తెలుసా? విజయ అప్పారావు. ఇది తన తాతయ్య పేరు. ఈయనకు జక్కన్న అని పేరు పెట్టింది నటుడు రాజీవ్ కనకాల.
రాజమౌళి పుస్తకాల పురుగు. సాధారణ కథలకు తన క్రియేటివిటీని జోడించి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం చిన్నప్పుడే అలవరచుకున్నారు. తన నానమ్మ వల్ల పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్నారు.
ఇంటర్ పూర్తిచేశాక ఖాళీగా ఉంటున్న రాజమౌళిని.. ‘జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ఆయన వదిన (కీరవాణి సతీమణి) అడిగారట. ప్రశ్నకు సమాధానం చెప్పలేని జక్కన్న అప్పటి నుంచే జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించారు.
ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర, తన తండ్రి విజయేంద్రప్రసాద్ దగ్గర అసిస్టెంట్‌గా కొన్నాళ్లు పనిచేశారు.
దర్శక,నిర్మాత గుణ్ణం గంగరాజు ఇంట్లో కొన్ని రోజులు ఉన్న రాజమౌళికి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ రాఘవేంద్రరావు దగ్గర పనిలో చేరారు.
అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రకటనలు చేసేందుకు రాఘవేంద్రరావుకి నచ్చేలా కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే ఒక్కో యాడ్‌కు రూ. 5000 ఇచ్చేవారు. అదే జక్కన్న తొలి సంపాదన.
ప్రకటనలు విజయవంతం అయ్యాక ‘శాంతి నివాసం’ సీరియల్‌కి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ ధారావాహిక కోసం రాజమౌళి ఏడాదిన్నరపాటు రోజుకు 18 గంటలు కష్టపడేవారు.
ఆ సీరియల్‌తో వచ్చిన దర్శకత్వం అనుభవంతో తొలిసారిగా ‘స్టూడెంట్ నెం.1’ సినిమా తీశారు. అప్పటి నుంచీ ఆయన సృష్టిస్తున్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది!
రాజమౌళి సినిమాల్లో హీరోలు వాడే ఆయుధాలకూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. లాకెట్లను కథలో భాగం చేసి భావోద్వేగానికి గురిచేయడం ఆయన స్పెషాలిటీ. హీరో పాత్రలకు విజిల్స్ వేయించే ‘ఫ్లాష్‌బ్యాక్’ ఉంటుంది. పెట్టిన బొట్టుతోనే పాత్రల ప్రాముఖ్యం పరోక్షంగా వివరిస్తారు.
హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాసేందుకే రాజమౌళి ఆసక్తి చూపిస్తారు. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కించనున్న సినిమా పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు: మహాభారతం. బహుశా అది పది భాగాలుగా తెరకెక్కించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.