ఈ కంపెనీల మొదటి పేరు తెలుసా?
సోనీ - టోక్యో షుషిన్ కొగ్యో
అసలు పేరు టోక్యో షుషిన్ కొగ్యో. ప్రపంచ మార్కెట్లో కస్టమర్లకు ఈ పేరు పలకడం ఇబ్బందిగా ఉండటంతో 1958లో ‘సోనీ’గా పేరు మార్చారు.
యాపిల్ - యాపిల్ కంప్యూటర్స్
మొదట్లో కంప్యూటర్స్ తయారు చేసేది కాబట్టి.. ‘యాపిల్ కంప్యూటర్స్’ అని పిలిచారు. ఆ తర్వాత అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‌ల తయారీపై దృష్టి పెట్టడంతో 2007లో దీన్ని ‘యాపిల్’గా మార్చారు.
అమెజాన్ - కదబ్రా
జెఫ్ బెజోస్ తన కంపెనీకి ‘అబ్రకదబ్రా’లోని ‘కదబ్రా’ను పేరుగా ఎంచుకున్నాడు. అయితే, కదబ్రా అనే పదం ఫోన్‌లో పలికినప్పుడు కడవర్(శవం)గా వినిపిస్తుందని తన లాయర్ చెప్పాడట. దీంతో మరో పేరు ఆలోచించి ‘అమెజాన్’గా మార్చాడు.
మెటా - ఫేస్‌బుక్
ఫేస్‌బుక్‌ను ఈ మధ్యే మెటాగా మార్చారు. కేవలం సోషల్‌మీడియాకే పరిమితం కాకుండా.. ఏఐ, వర్చువల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా కంపెనీ పేరు మార్చినట్లు సంస్థ ప్రకటించింది.
గూగుల్ - బ్యాక్‌రబ్
లారీ పేజ్, సెర్జీ బ్రిన్ తమ సెర్చ్ ఇంజిన్‌కి 1996లో ‘బ్యాక్‌రబ్’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పేరు నచ్చక మార్చాలనుకున్నారు. ‘గూగోల్(1 పక్కన 100 సున్నాలుండే సంఖ్య)’ అని పెట్టగా ‘గూగుల్’గా స్థిరపడింది.
ఇన్‌స్టాగ్రామ్ - బార్బన్
ఇది మొదట్లో ‘బార్బన్’ పేరుతో ఓ వెబ్‌సైట్‌గా ఉండేది. 2010లో యాప్‌ను తీసుకొచ్చినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌గా మార్చారు. ఇన్‌స్టాంట్ కెమెరా, టెలిగ్రామ్ పదాల నుంచి ఈ పేరును సృష్టించారు.
నైక్ - బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్
అసలు పేరు ‘బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్’. 1964లో దీన్ని స్థాపించగా.. 1971లో పేరు మార్చాలనుకున్నారు. సంస్థలో ఒక ఉద్యోగి.. తన కలలో కనిపించిన గ్రీక్ దేవుడు ‘నైక్’ పేరును సూచించడంతో ఆ పేరును ఫిక్స్ చేశారు.
పెప్సీ - బ్రాడ్స్ డ్రింక్
ఫార్మాసిస్ట్ కాలెబ్ బ్రాదమ్ 1893లో ‘బ్రాడ్స్ డ్రింక్’పేరుతో ఈ డ్రింక్‌ను విక్రయించారు. డిస్‌పెప్సియా(అజీర్తి) నుంచి ఉపశమనం కలిగిస్తుందని ప్రచారంలో ఉండటంతో 1898లో ‘పెప్సీ-కోలా’గా మార్చారు.
స్నాప్‌చాట్ - పికాబూ
దీన్ని మొదట ‘పికాబూ’అని పిలిచేవారు. అప్పటికే ఈ పేరును ట్రేడ్‌మార్క్ చేసుకున్న ఓ కంపెనీ పేరు మార్చుకోవాలంటూ నోటీసులు పంపింది. దీంతో స్నాప్‌చాట్‌గా మారింది.
టిండర్ - మ్యాచ్ బాక్స్
మొదట దీనికి ‘మ్యాచ్‌బాక్స్’ అని పేరు పెట్టారు. అది ‘మ్యాచ్.కామ్’అనే వెబ్‌సైట్ పేరును పోలి ఉండటంతో ‘టిండర్’గా మార్చారు. టిండర్ అంటే జ్వలించే గుణమున్న పదార్థమని అర్థం.
ఎక్స్ - ట్విటర్
సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందులో అనేక మార్పులు తీసుకొచ్చిన మస్క్.. ఇటీవల ట్విటర్ యాప్‌ను ‘X’గా మార్చేశారు. వెబ్‌సైట్ మాత్రం‘ట్విటర్’గానే ఉంది.