నీటిని ఎలాపడితే అలా తాగితే సమస్యలే! ఈ విషయంలో చిన్న చిన్న పొరపాట్లే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల నీరు తాగేటప్పుడు ఈ పొరపాట్లు మాత్రం చేయకండి.
ఒకేసారి ఎక్కువగా తాగేయడం..
శరీరానికి అవసరమైన నీటిని మాత్రమే తాగాలి తప్ప మితిమీరిన వాడకం అనర్థమే అంటున్నారు వైద్యరంగ నిపుణులు. ఒకేసారి ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడటంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.
దాహం వేసినప్పుడు నీటిని తీసుకోకపోవడం..
చాలా మంది దాహం వేసిన వెంటనే నీరు తాగరు. అలా చేయకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. తద్వారా అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. రోజంతా తగిన మోతాదులో నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవడం అవసరం.
కృత్రిమ తీపి పదార్థాలు జోడించడం..
నీళ్లు తాగేటప్పుడు నోటికి రుచికరంగా ఉండేందుకు చాలామంది కృత్రిమంగా తీపి పదార్థాలను కలుపుతుంటారు. తద్వారా అదనపు చక్కెర వినియోగానికి దారితీయొచ్చు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నిమ్మ, దోస వంటి సహజ పదార్థాలను నీటిలో కలుపుకొని తాగడం ఉత్తమం.
గడగడా గుటకలేయడం..
ఏదో పని హడావుడిలో పడి వేగంగా గుటకలేస్తూ నీటిని తాగేస్తుంటారు చాలా మంది. అలా చేయడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు శరీరంలో అసౌకర్యానికి దారితీయొచ్చు. మీ శరీరం నీటిని సమర్థంగా గ్రహించేలా సిప్ చేయండి. తద్వారా జీర్ణ సంబంధ సమస్యల్ని నియంత్రించవచ్చు.
నిలబడి నీళ్లు తాగడం..
నిలబడి నీళ్లు తాగడం శ్రేయస్కరం కాదు. అలా చేయడం వల్ల శరీరం నీటిని సమర్థంగా గ్రహించడానికి అవకాశం ఉండదు. జీర్ణ సంబంధిత ప్రక్రియ సరిగా జరగదు. కూర్చొని కొంచెం కొంచెం నీటిని తాగడం మంచిది.
భోజనం చేసిన వెంటనే నీరు తాగడం
తిన్న వెంటనే నీటిని గడగడ తాగేయడం సరికాదు. అలా చేస్తే తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. పొట్టలో ఉత్పత్తయ్యే ఎంజైమ్స్, జీర్ణ రసాలు తక్కువగా విడుదల అవుతాయి. ఆహారం తిన్న గంట తర్వాత నీటిని తాగితే మంచిది.