ఈ చిట్కాలు.. మీ కరెంటు బిల్లును తగ్గిస్తాయ్‌!

ప్రతి నెలా కరెంటు బిల్లు ఎంత వచ్చిందో చూసుకొనే పరిస్థితి దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండేదే! తీరా చూశాక అబ్బా.. ఇంత వచ్చిందా అనే బాధ మరోవైపు! ఈ నేపథ్యంలో మీ విద్యుత్‌ బిల్లు భారాన్ని కొంతమేర తగ్గించే కొన్ని చిట్కాలివిగో!

ఇంకా మీరు ట్యూబ్‌ లైట్లు, ఫిలమెంట్‌ బల్బులే వాడుతున్నారా? అయితే, వెంటనే ఎల్‌ఈడీ బల్బులకు మారండి. ఇవి ట్రెండీగా ఉండటంతో పాటు తక్కువ విద్యుత్‌ వినియోగంతో ఎక్కువ కాంతినిస్తాయి. 

అవసరం లేనప్పుడు లైటు, ఫ్యాన్‌, టీవీ వంటివి కచ్చితంగా ఆఫ్‌ చేసి అన్‌ ప్లగ్‌ చేయండి. వాడకంలో లేని వాటిని ఆపేయడం వల్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. 

ఏసీ వాడుతున్నట్లయితే ఎప్పుడూ 24 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోండి. దీంతో చాలా వరకు విద్యుత్తు ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) చెబుతోంది. 

5-స్టార్ BEE రేటింగ్ ఉన్న పరికరాల వినియోగంతో తక్కువ విద్యుత్‌ ఖర్చవుతుంది. పాత ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి స్మార్ట్‌ పరికరాలకు అప్‌గ్రేడ్‌ అవ్వండి.

ఎలక్ట్రానిక్‌ ఆధారిత గృహోపకరణాలను క్రమం తప్పకుండా సర్వీస్ చేయించుకోవాలి. సరిగ్గా పనిచేయని పరికరాలు అధిక విద్యుత్‌ను వినియోగిస్తాయి. 

కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లపై పని అయ్యాక అలాగే వదిలేయకండి. పని అవ్వగానే వెంటనే షట్‌డౌన్‌ చేయడం అలవాటు చేసుకోండి.

ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషిన్‌, ఏసీలను కొనేటప్పుడు ఇన్వర్టర్‌ ఆధారిత పరికరాలు తీసుకుంటే మంచిది. సాధారణ ఉత్పత్తులతో పోలిస్తే ఇవి తక్కువ విద్యుత్‌ను తీసుకుంటాయి. 

వేడినీళ్ల కోసం గీజర్‌ ఆన్‌ చేయగానే ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులంతా ఒకరి వెంట ఒకరు స్నానం చేయడం ద్వారా విద్యుత్తు వినియోగం తగ్గించుకోవచ్చు.

ఇంట్లో ఉదయం తలుపులు, కర్టెన్లు తీసి పెట్టుకోండి. సహజమైన గాలి, వెలుతురు ఇంట్లోని గదుల్లోకి వచ్చేలా చూసుకోవడం ద్వారా విద్యుత్‌ ఆదా చేసుకోవచ్చు.

బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్‌ మెషిన్‌లో డ్రై చేయడానికి బదులు.. బయట ఆరబెట్టడం ద్వారా విద్యుత్‌ వాడకం తగ్గడమే కాకుండా బట్టల మన్నికా పెరుగుతుంది. 

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

ట్రావెల్‌ డిటెక్టివ్‌.. ఆన్వీ కామ్‌దార్‌

Eenadu.net Home