పెళ్లికి ఎందుకంత ఖర్చు?

భారత్‌లో కుటుంబాలు అత్యధికంగా పెళ్లి కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఏ కుటుంబమైనా ఆర్థిక స్థోమతకు తగినట్లు.. కొన్నిసార్లు స్థోమతకు మించి వివాహాలు చేస్తున్నాయి. అసలు వివాహానికి ఎందుకు ఇంత ఖర్చు అవుతుందో చూద్దామా..

ఫంక్షన్‌ హాల్‌

పెళ్లంటేనే బంధువుల మధ్య చేసుకునే వేడుక. వారందరూ హాజరవ్వడానికి వేదిక కావాలి కదా! వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేసుకోవాలి. హాల్‌ రేంజ్‌ను బట్టి సగటున రూ.50వేల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతుంది.

డెకరేషన్‌

పెళ్లిల్లో డెకరేషన్‌ అనేది పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడంతా వెడ్డింగ్‌ ప్లానర్స్‌దే హవా. హాల్‌/ఇంటిని, అతిథుల సంఖ్యను బట్టి వారే డేకరేషన్‌ చేస్తారు. వీటికయ్యే ఖర్చు సగటున రూ.70వేల నుంచి రూ.30లక్షలు. 

కేటరింగ్‌

పెళ్లి కన్నా.. పెళ్లిలో పెట్టిన విందునే పదికాలాల పాటు గుర్తు పెట్టుకుంటారని నానుడి. అందుకే, అతిథులకు రుచికరమైన విందు ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. వంటకాలను బట్టి ప్లేట్‌ ధర రూ.600 నుంచి రూ.1000 వరకు ఉంటుంది.

పెళ్లిదుస్తులు

వివాహ వేడుకలో ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. హల్దీ, సంగీత్‌, పెళ్లి, రిసెప్షన్‌లో వధూవరులు ధరించే దుస్తులు ఆకట్టుకునేలా ఉండాలని ఖర్చుకు వెనుకాడరు. వీటి ధర రూ.వేల నుంచి రూ.లక్షల్లో ఉంటుంది. 

జ్యువెలరీ

వివాహ వేడుకలో వధువును బంగారు నగలతో అలంకరిస్తారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.74వేలకు పైమాటే. కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఆభరణాలు చేయిస్తుంటారు. వీటికయ్యే ఖర్చు రూ.లక్షల్లో ఉంటుంది.

ఆహ్వాన పత్రికలు

సాధారణంగా పెళ్లి పత్రికలు రూ. 50 నుంచి రూ. 100 వరకు ఉంటాయి. కానీ, ఇతరుల కంటే తమ ఆహ్వాన పత్రిక ఆకట్టుకునేలా, వైవిధ్యంగా ఉండాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఒక్కో పత్రికకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఫోటోలు-వీడియోలు

ఒకప్పుడు పెళ్లిలో మాత్రమే ఫొటోలు తీసేవారు.. ఇప్పుడు హల్దీ వేడుక నుంచి రిసెప్షన్‌ వరకు ఫొటోగ్రాఫర్లు ఉండాల్సిందే. పైగా ప్రీవెడ్డింగ్‌ షూట్‌లు. వేడుక పూర్తయ్యేలోపు వారికి కనీసం రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల వరకూ ముట్టజెప్పాల్సిందే!

బస

దూరప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు బస ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వారికి ఏ లోటు రాకుండా ఉండటం కోసం తెలిసినవారి ఇళ్లను అద్దెకు తీసుకుంటారు, హోటల్స్‌లో రూమ్స్‌ బుక్‌ చేస్తారు. వీటికీ కొంత ఖర్చవుతుంది.

ఇతర ఖర్చులు

పెళ్లి తర్వాత బరాత్‌ కోసం బ్యాండ్‌, డీజేలు, బాణాసంచా, చివరి నిమిషంలో అవసరమయ్యే వస్తువులు, అద్దె కార్లు, డ్రైవర్లు, పని వాళ్లకు ఇవ్వాల్సిన భత్యాలు తదితర ఖర్చులూ మీదపడుతుంటాయి.

మధ్య తరగతి కుటుంబం వారి స్థోమతలో పెళ్లి చేస్తేనే... ఇవన్నీ కలిపి సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10లక్షల పైనే ఖర్చవుతుంది. వేడుక ఖర్చు కాకుండా చట్టరీత్య నేరమైనా వరుడికి కట్నం అదనం.

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

ట్రావెల్‌ డిటెక్టివ్‌.. ఆన్వీ కామ్‌దార్‌

Eenadu.net Home