దేశంలోని ఫేమస్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌లను చూశారా!

సుదర్శన్‌ సేతు

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. అరేబియా సముద్రంపై నిర్మించిన ఈ వంతెన.. గుజరాత్‌లోని బెట్‌ ద్వారకా-ఓఖా ప్రాంతాన్ని అనుసంధానిస్తుంది. 2.3కి.మీ పొడవు ఉంటుంది. ఫిబ్రవరి 25, 2024న ప్రారంభించారు.

విద్యసాగర్‌ సేతు

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా.. హౌరా నగరాలను కలిపే వంతెన ఇది. హూగ్లీ నదిపై 823 మీటర్ల పొడవుతో నిర్మించారు. దేశంలోనే తొలి కేబుల్‌ బ్రిడ్జ్‌గా పేరొందింది. 1992లో ప్రారంభించారు. 

మనోహర్‌ సేతు

గోవాలో ఉంది. జువారి నదిపై నిర్మించిన ఈ వంతెనను న్యూ జువారీ బ్రిడ్జ్‌గా పిలుస్తారు. ఇది ఉత్తర గోవా.. దక్షిణ గోవాను కలుపుతుంది. 2022లో ప్రారంభించిన తొలిదశ వంతెన 640 మీటర్ల పొడవు ఉంది.

అటల్‌సేతు

జమ్ముకశ్మీర్‌లోని కతువా జిల్లాలో రావి నదిపై ఉన్న వంతెన ఇది. బషోలి, దునెరా ప్రాంతాలను కలిపే ఈ వంతెన 592 మీటర్ల పొడవుంటుంది. 2015లో దీన్ని ప్రారంభించారు. అటల్‌ బిహారి వాజ్‌పేయీ పేరును ఈ వంతెనకు పెట్టారు. 

కోట చంబల్‌ బ్రిడ్జ్

ఈ బ్రిడ్జ్‌ను రాజస్థాన్‌లోని చంబల్‌ నదిపై 2017లో ప్రారంభించారు. ఈ వంతెన కోటను.. రాజస్థాన్‌ శివారు ప్రాంతాన్ని అనుసంధానం చేస్తుంది. కేబుల్‌ వంతెన పొడవు 1.1కి.మీ ఉంటుంది. 

న్యూ యమునా బ్రిడ్జ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓల్డ్‌ నైనీ బ్రిడ్జ్‌పై ట్రాఫిక్‌ను తగ్గించడం కోసం నిర్మించిన వంతెన ఇది. యుమునా నదిపై ఉన్న ఈ బ్రిడ్జ్‌ 1.5కి.మీ పొడవుతో ప్రయాగ్‌రాజ్‌, నైనీ ప్రాంతాలను కలుపుతుంది. 2004లో దీన్ని ప్రారంభించారు.

సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌

వజీరాబాద్‌, ఈస్ట్‌ దిల్లీని అనుసంధానిస్తూ యమునా నదిపై ఉన్న వంతెన ఇది. సెంటిలివర్‌తోపాటు కేబుల్‌తో నిర్మించారు. ఈ బ్రిడ్జిపై ఉన్న పైలాన్‌ ఎత్తు 154 మీటర్లు ఉంటుంది. వంతెన పొడవు 675 మీటర్లు.

బాంద్రా-వర్లీ సీ లింక్‌

ముంబయిలో అరేబియా సముద్రంపై నిర్మించిన ఈ వంతెన.. పశ్చిమ ముంబయిలోని బాంద్రాను, దక్షిణ ముంబయిలోని వర్లీని కలుపుతుంది. 5.6 కిమీ ఉండే ఈ బ్రిడ్జ్‌లో కేబుల్ పోర్షన్‌ 600 మీటర్లు ఉంటుంది. దీన్ని 2010లో ప్రారంభించారు.

దుర్గం చెరువు బ్రిడ్జ్‌

హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన వంతెన ఇది. జూబ్లీహిల్స్‌ను, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను కలిపే ఈ వంతెన 233 మీటర్ల పొడవు ఉంటుంది. 2020లో ప్రారంభం కాగా.. పర్యటకంగానూ పాపులరైంది. 

ఇవే కాకుండా గుజరాత్‌లోని సూరత్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌, గోవాలోని అటల్‌ సేతు, బిహార్‌లోని బీపీ మండల్‌ లాంటి తదితర బ్రిడ్జ్‌లను కూడా తీగలతో నిర్మించారు.

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

Eenadu.net Home