#eenadu
కుంగుబాటు, ఒంటరితనం, పని ఒత్తిడి, చిరాకు, బద్ధకం, అలసట, ఏకాగ్రత లోపించడం.. ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్యలివి. వీటిని అధిగమించడానికి.. నిపుణులు ఇస్తున్న సలహాలివే..
నిద్రలేమి అనేక సమస్యలకు కారణమవుతుంది. ఏడు నుంచి ఎనిమిది గంటలు అంతరాయం లేకుండా నిద్రపోవాలి.
పెందలాడే నిద్రపోవడమే కాకుండా ఉదయాన్నే తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలి. కచ్చితంగా ఉదయం 6 గంటల్లోపు నిద్రలేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
రోజూ వ్యాయామం చేయడం అలవరచుకోవాలి. కుదిరితే ఉదయం, లేకపోతే సాయంత్రం వాకింగ్, జాగింగ్ వంటివి చేయాలి.
ఏదైనా పనిలో ఉన్నా, నిద్రపోతున్నా ఫోన్‌ను దూరంగా పెట్టడం తప్పనిసరి. ఫోన్ వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. వీలైతే నోటిఫికేషన్లు ఆపడం ఉత్తమం.
పాలు, పండ్లు, గుడ్లు, చేపలు, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో శరీరాన్ని పుష్టిగా ఉంచుకోవచ్చు.
యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల భావోద్వేగాలు అదుపులోకి వస్తాయి. ఒత్తిడి తగ్గుతుంది. శరీరం చురుగ్గా ఉంటుంది.
ఐరన్, విటమిన్ డి, విటమిన్ 12బి లోపం లేకుండా చూసుకుంటే.. నిస్సత్తువ రాదు. రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
ఇతర భాషలు, కొత్త నైపుణ్యాలు, సంగీతం, ఆటలు వంటివి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. ఒంటరితనం నుంచి కూడా విముక్తిని కలిగిస్తాయి.
మద్యం, పొగాకుకి బానిసలైతే భవిష్యత్తుపై దృష్టి పెట్టలేరు. అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి. ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలి.
తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఒక్కపూటైనా వారితో కలిసి కబుర్లు చెబుతూ భోజనం చేయాలి.