చిత్రాలు (01-09-2024)

కుండపోత వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం నగరంలో బీభత్సం సృష్టించింది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. వెంకటేశ్వరనగర్‌లో ఓ ఇంటిని మున్నేరు వరద చుట్టుముట్టింది. 

భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. కొన్నిచోట్ల పట్టాలపైకి వరదనీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో విజయవాడ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌ జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో పరివాహక కాలనీల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. 

తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖమ్మం నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలోకి భారీగా వరదనీరు చేరి పాఠశాల బస్సులు నీటమునిగాయి. 

కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ- కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది. ఎగువ, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ శివారులో రైలుపట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది.

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాట్‌ రోడ్డులో మూల మలుపుల వద్ద పలు చోట్ల పెద్ద బండ రాళ్లు జారి పడ్డాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

భారీ వర్షాల కారణంగా సూర్యాపేట వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 65)పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి - అద్దంకి, ఖమ్మం వైపు దారి మళ్లిస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో వరద నీటితోపాటు విష సర్పాలు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home