ఈ దేశాలూ పేర్లు మార్చుకున్నాయ్!
మన దేశం పేరును ఇండియాకి బదులు భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఇండియా స్థానంలో భారత్ అని పేర్కొంటోంది. గతంలో కొన్ని దేశాలు కూడా పేరు మార్చుకున్నాయ్. వాటిలో ముఖ్యమైన వాటి వివరాలివి!
బర్మా-మయన్మార్
భారత్ పొరుగు దేశం. 1989లో అధికారంలో ఉన్న సైన్యం.. దేశం పేరును బర్మా నుంచి మయన్మార్‌గా మార్చింది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ పేరును ఆమోదించింది.
టర్కీ - తుర్కియే
గతేడాదిలో టర్కీ ప్రభుత్వం తమ దేశం పేరును తుర్కియేగా మార్చుకుంది. అక్కడి వారి సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు ‘తుర్కియే’ పేరు అద్దం పడుతుందని పేర్కొంది.
పర్షియా - ఇరాన్
భారత్ చరిత్రలోనూ పర్షియా పేరు వినిపిస్తుంటుంది. 1935లో ఈ దేశం పేరును ఇరాన్‌గా మార్చారు.
సియామ్ - థాయ్‌లాండ్
దేశం పేరును 1939లో సియామ్ నుంచి థాయ్‌లాండ్‌గా మార్చారు. థాయ్ అంటే స్వతంత్ర మనిషి అని అర్థం. స్వతంత్ర మనుషులు ఉండేచోటు కాబట్టి దీన్ని ‘థాయ్‌లాండ్’ అని మార్చినట్లు చెబుతుంటారు.
హాలెండ్ - నెదర్లాండ్స్
రెండు పెద్ద రాష్ట్రాలు హాలెండ్ పేరుతో ఉండేవి. దేశం పేరు ఈ ప్రాంతాలను మాత్రమే సూచిస్తుండటంతో పేరు మార్చాలని ప్రభుత్వం భావించింది. అలా 2020లో కింగ్‌డమ్ ఆఫ్ ‘నెదర్లాండ్స్’గా మార్చారు.
సిలోన్ - శ్రీలంక
సిలోన్‌కు స్వాతంత్ర్య వచ్చిన తర్వాత నేతలు దేశం పేరు మార్చాలని భావించారు. ఈ క్రమంలోనే శ్రీలంకగా మార్చారు.
చెక్ రిపబ్లిక్ - చెకియా
చెక్ రిపబ్లిక్ దేశం 2016లో చెకియాగా మారింది. వ్యాపారులకు, క్రీడల్లో జట్లకు దేశం పేరును ఉపయోగించటం సులభతరం చేసేందుకు అక్కడి ప్రభుత్వం పేరులో మార్పు చేసింది.
రోడేసియా - జింబాబ్వే
బ్రిటీష్ పాలన నుంచి 1980లో రొడేసియాకు స్వాతంత్ర్యం వచ్చింది. దీంతో బ్రిటీష్ పాలనను మర్చిపోయి సార్వభౌమాధికార దేశంగా మారిన నేపథ్యంలో దేశం పేరును జింబాబ్వేగా మార్చారు.