#Eenadu
ఓటు అమూల్యమైనది.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఓటు వేసేటప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దు. మరి ఓటు వేసే విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందామా..
1. ముందుగా మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందో తెలుసుకోవాలి. ఓటరు జాబితాలో పేరు చూసుకొని, ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు చీటీని దగ్గరపెట్టుకోవాలి. అది లేకపోతే ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.
2. ఓటరు చీటీ, గుర్తింపు కార్డు పట్టుకొని పోలింగ్ స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడ పోలింగ్ అధికారి-1 మీ గుర్తింపుకార్డు, సీరియల్ నంబర్‌ను వెరిఫై చేస్తారు. అభ్యర్థుల తరఫు పోలింగ్ ఏజెంట్లు కూడా సరిచూసుకొని ఓటరు జాబితాలో మీ పేరుపై టిక్ పెడతారు.
3. మీ గుర్తింపు కార్డు, సీరియల్ నంబర్ వెరిఫై అయ్యాక పోలింగ్ అధికారి-2 వద్దకు వెళ్లాలి. వారు మీ ఎడమ చేతి వేలిపై సిరా గుర్తు వేస్తారు. వారి వద్ద ఉండే రిజిస్టర్‌లో మీ సంతకం/వేలిముద్ర తీసుకొని ఒక చీటీ ఇస్తారు.
4. ఆ తర్వాత పోలింగ్ అధికారి-3 వద్దకు వెళ్లి ఆ చీటీని అందించాలి. అప్పుడు వారు మీ వేలి సిరా గుర్తును తనిఖీ చేస్తారు. అనంతరం మిమ్మల్ని ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి పంపిస్తారు. ఈవీఎంపై ఉన్న బల్బు వెలుగుతూ కనిపిస్తుంది.
5. ఈవీఎంలో వరుసగా అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. వాటికి ఎదురుగా నీలి రంగు బటన్లుంటాయి. మీరు ఓటు వేయాలనుకునే వ్యక్తి పేరు ఎదురుగా ఉన్న బటన్‌ను నొక్కాలి.
6. ఓటు వేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోకూడదు. బటన్ నొక్కగానే ఎర్ర రంగు లైట్ వెలుగుతుంది. ఆ తర్వాత బీప్ శబ్దం వస్తుంది. అప్పుడే ఓటువేయడం పూర్తయినట్టు. అందుకే, సౌండ్ వచ్చే వరకు వేచి ఉండాలి.
7. ఓటు వేశాక ఈవీఎం పక్కనే ఉండే వీవీప్యాట్ బాక్స్‌లో మీరు ఎవరికైతే ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమసంఖ్య, పేరు, గుర్తుతో కూడిన చీటి 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. దాన్ని చూసి మీ ఓటు సరిగా పడిందో లేదో నిర్థరించుకోవచ్చు.
8. బీప్ శబ్దం రాకపోయినా, వీవీప్యాట్‌లో చీటీ కనిపించకపోయినా వెంటనే అక్కడ ఉండే ప్రిసైడింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేయాలి. లోపాలు ఉంటే సరిచేసి మళ్లీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.