‘12th ఫెయిల్‌’తో డిస్టింక్షన్‌లో పాసైన విక్రాంత్..

బాలీవుడ్‌ సినిమా ‘ట్వెల్త్‌ ఫెయిల్’ సంచలనం సృష్టించింది. చిన్నసినిమాగా వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇందులో హీరోగా నటించిన విక్రాంత్‌ మస్సే.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

అనురాగ్‌ పాథక్‌ రచించిన ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ అనే నవల ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు.. దర్శకుడు విధు వినోద్‌ చోప్రా. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ పాత్రలో విక్రాంత్‌ జీవించాడు. ఈ పాత్రకు గాను 2024 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డునూ అందుకున్నాడు.

సీరియల్స్‌తో మొదలుపెట్టి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌పై హీరోగా మారిపోయాడు. బాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపును సాధించాడు.  

2007లో ‘ధూమ్‌ మఛావో ధూమ్‌’ సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘బాలికా వధు’తో పాపులరయ్యాడు. దాదాపు ఏడేళ్లపాటు వరుసగా సీరియల్స్‌లో నటించి టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

‘లుటేరా’తో 2013లో కీలక పాత్ర పోషించి సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ‘దిల్‌ దఢ్‌ఖనే దో’, ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’, ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’, ‘ఫోరెన్సిక్‌’, ‘గ్యాస్‌లైట్‌’, ‘ముంబైకర్‌’ వంటి పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు.  

పదహారేళ్ల వయసులో నటుడిగా మారిన విక్రాంత్‌..‘మిర్జాపుర్‌’, ‘క్రిమినల్‌ జస్టిస్‌’, ‘మేడ్ ఇన్‌ హెవెన్‌’ వంటి వెబ్‌సిరీస్‌లతోనూ ఆకట్టుకున్నాడు. 

‘బ్రోకెన్‌ బట్‌ బ్యూటీఫుల్‌’వెబ్‌సిరీస్‌లో తనకు జోడీగా నటించిన శీతల్‌ ఠాకూర్‌తో ప్రేమలో పడ్డాడు. 2019లో నిశ్చితార్థం జరగ్గా.. 2022లో ఈ జంట వివాహం చేసుకుంది.

విక్రాంత్‌ మంచి డ్యాన్సర్‌. ప్రముఖ డ్యాన్స్‌ ట్రైనర్‌ షైమాక్‌ దావర్‌ దగ్గర మోడ్రన్‌ కాంటెపరరీ, మోడ్రన్‌ జాజ్‌ వంటి నృత్యరీతుల్లో శిక్షణ తీసుకున్నాడు.  

‘ట్వెల్త్ ఫెయిల్’లో నటించిన విక్రాంత్‌పై బాలీవుడ్‌ తారలు ప్రశంసలు కురిపించారు. కంగనా రనౌత్‌ విక్రాంత్‌ను విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌తో పోల్చారు. ఆ సినిమాలో ‘విక్రాంత్‌ చాలా బాగా నటించారు’అని ఆలియా భట్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

ఈ సినిమాను ప్రశంసిస్తూ హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె, అనిల్‌ కపూర్‌, కమల్‌ హాసన్‌, కత్రినా కైఫ్‌, రిషబ్‌ శెట్టి, ఫరాన్‌ అక్తర్‌ వంటి పలువురు సినీ ప్రముఖులు పోస్టులు చేశారు.

ఇక విక్రాంత్‌కి ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా విహార యాత్రలకు వెళ్తాడు. ఇంట్లో ఉంటే డ్యాన్స్‌ చేస్తూ.. వీడియో గేమ్స్‌ ఆడుతూ సమయం గడిపేస్తాడట. 

‘నాకు షాపింగ్‌ చేయడమన్నా ఎంతో ఇష్టం. రకరకాల ఫ్లేవర్ల పర్‌ఫ్యూమ్‌లు, షూస్, సన్‌ గ్లాసెస్‌ ఎక్కువగా కొంటుంటాను’ అని విక్రాంత్‌ ఓ సందర్భంలో చెప్పాడు.

ఇషా చావ్లా సెకండ్‌ ఇన్నింగ్స్‌..

జాణవులే నెర ‘జాన్వి’విలే

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు

Eenadu.net Home