ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీ.. ‘2018’ చిత్ర విశేషాలివే!

చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డులకు భారత్‌ నుంచి ఈసారి మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘2018’ను పంపారు. టోవినో థామస్‌ హీరోగా జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం వేసవిలో విడుదలైంది. ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌’ కేటగిరిలో ఎంపికైంది.

2018లో కేరళలో సంభవించిన వరదలు, ఆ రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ‘2018 ఎవ్రీవన్‌ ఈజ్‌ ఏ హీరో’ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

2018 వరదలపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నాక దర్శకుడు జూడ్‌ ఆంథోనీ ఎక్కువగా ఫ్లడ్‌, సునామీ సినిమాలు చూశారు. ఆ సినిమాలే తనలో స్ఫూర్తి నింపాయని ఆయన  చెప్పారు.

దర్శకుడు జూడ్‌ చెప్పిన ‘2018’ కథ విని టోవినో థామస్‌ మొదట భావోద్వేగానికి గురయ్యారు. స్క్రిప్ట్ చదవగానే వరదల నాటి పరిస్థితులు గుర్తుకు వచ్చి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

సినిమా కోసం జూడ్‌ ఆంథోనీ ఒక భారీ కంటైనర్‌ను సిద్ధం చేయించారు. అందులోనే సెట్‌ వేయించి ఫ్లడ్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన సన్నివేశాలన్నింటినీ షూట్‌ చేశారు.

వరదలకు సంబంధించిన సన్నివేశాలు షూట్‌ చేస్తునన్ని రోజులూ తాను ఎంతో భయపడ్డానని జూడ్‌ తెలిపారు. ఎలక్ట్రికల్‌ పరికాలతో నీటిలో షూట్‌.. నటీనటులకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని భగవంతుడిని రోజూ ప్రార్థించేవారట.

అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌లో యాక్ట్‌ చేయడం ఎంతో కష్టంగా అనిపించిందని టోవినో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల చెవి సంబంధిత ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చాయని.. వైద్యులు ఇచ్చిన మందులు వేసుకుని షూట్‌లో పాల్గొన్నానని అన్నారు.

వేసవి కానుకగా మే నెలలో విడుదలైన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. రూ.200 కోట్ల వసూళ్లతో మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ రికార్డు సొంతం చేసుకుంది.

తన నటనతో టోవినో ప్రేక్షకుల మది గెలుచుకున్నారు. ఈ చిత్రానికి గానూ ఆయన సెప్టిమియస్ అవార్డుల్లో ఉత్తమ ఆసియా నటుడిగా అవార్డు దక్కించుకున్నారు.

ప్రస్తుతం ఇది సోనీలివ్‌ ఓటీటీ వేదికగా మలయాళం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

‘యానిమల్‌’ త్రిప్తి గురించి తెలుసా?

Eenadu.net Home