టొవినో.. వైవిధ్యానికి చిరునామా
కథల ఎంపిక విషయంలోనూ కొందరు నటులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రతి సినిమాకు వైవిధ్యం ప్రదర్శిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇలాంటి వారిలో మలయాళ నటుడు టొవినో థామస్ ఒకరు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆయన గురించి కొన్ని విశేషాలివీ...
ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. చదువుకునే రోజుల్లో ఆటల్లో చురుకుగా ఉండేవారు. ఫిట్‌నెస్, మోడలింగ్‌పైనా ఆయనకు ఆసక్తి ఎక్కువే.
2012లో సినిమా రంగంలోకి అడుగుపెట్టి ‘తీవ్రమ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశారు. అదే ఏడాది ‘ప్రభువింతే మక్కళ్’తో నటుడిగా పరిచయమయ్యారు.
రెండో సినిమా ‘ఏబీసీడీ’లో విలన్‌గా నటించారు. తర్వాత ‘ఆగస్టు క్లబ్’, ‘7th డే’, ‘ఒన్నమ్ లోక మహాయుధం’ తదితర వాటిల్లో కీలక పాత్రలు పోషించారు.
ఈ నటుడి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఎన్ను నింతే మొయిడీన్’. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ సహా పలు అవార్డులు అందుకున్నారు.
సోలో హీరోగా టొవినో సొంతం చేసుకున్న తొలి విజయం ‘మాయానది’. 2017లో విడుదలైందీ చిత్రం.
2018లో ‘అభియుమ్ అనువుమ్’తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ‘మారి 2’ (ధనుష్)లో కీ రోల్ ప్లే చేశారు.
టొవినోను తెలుగు వారికి బాగా దగ్గర చేసిన చిత్రం ‘మిన్నల్ మురళి’. ‘2018’ సినిమా సైతం ఇక్కడ హిట్‌గా నిలిచింది. ఇది ఆస్కార్ అవార్డ్స్-2024కు భారత్ నుంచి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో అధికారిక ఎంట్రీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
టొవినోలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ‘అదృశ్య జలకంగళ్’. ‘టాలిన్ బ్లాక్ నైట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ (2023)లో ప్రదర్శనకు ఎంపికైన తొలి మలయాళ చిత్రంగా నిలిచింది.
అదే సినిమాలోని నటుడిగాను 44వ ‘ఫాంటస్‌పోర్టో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’తో మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న ఈయన ‘నడికర్’, ‘ఏఆర్‌ఎం’, ‘ఎల్ 2’, ‘ఐడెంటిటీ’తో బిజీగా ఉన్నారు.
లుక్ పరంగానూ ప్రయోగాలకు ముందుంటారు. స్క్రిప్టు నచ్చాలేగానీ పాత్ర నిడివి ఎంతైనా పట్టించుకోరు. అందుకే కెరీర్ ప్రారంభంలోనే కాదు ఇప్పటికీ ఇతర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గాయకుడు, నిర్మాతగా సత్తా చాటిన టొవినో క్లాస్‌మేట్ లిదియాను ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న మూడో మలయాళ నటుడీయన. అంతకుముందు మమ్ముట్టి, మోహన్‌లాల్ ఉన్నారు.
2021లో కేరళ ప్రభుత్వం ప్రారంభించిన సామూహిక సన్నధసేన కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ అంటే ఇష్టమని, వారితో మల్టీస్టారర్ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఓ సందర్భంలో మనసులో మాట బయటపెట్టారు.