గాల్ గడొట్.. హార్ట్ ఆఫ్ హాలీవుడ్!
‘వండర్ విమెన్’గా ప్రపంచమంతా పరిచయమున్న హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గాల్ గడొట్.. తన తాజా చిత్రంతో భారతీయులకు మరింత చేరువకానుంది.
(Photos: Instagram/Gal Gadot)
ఎలా అంటారా..? ఈమె నటించిన ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో భారతీయ నటి ఆలియా భట్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది.
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో గాల్ ఒకరు. డి.సి. స్టూడియోస్, వార్నర్ బ్రోస్ నిర్మించిన చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తుంటుంది.
ఇజ్రాయెల్‌లో ఏప్రిల్ 30, 1985న ఓ మధ్యతరగతి కుటుంబంలో గాల్ జన్మించింది. చిన్నవయసు నుంచే వెయిటర్‌గా, బేబీ సిట్టర్‌గా పనిచేస్తూ చదువుకుంది.
అందాల పోటీల్లో పాల్గొంటూ 18వ ఏటా ‘మిస్ ఇజ్రాయెల్’ అందాల కిరీటం దక్కించుకుంది. పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించింది.
పాఠశాల విద్య పూర్తవగానే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌లో రెండేళ్లపాటు సేవలందించింది. ఇజ్రాయెల్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఆర్మీలో పనిచేయాల్సిందే.
ఆ తర్వాత న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆ సమయంలోనే ఈమెకు జేమ్స్‌బాండ్ సిరీస్ ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’లో బాండ్ గర్ల్‌గా నటించే అవకాశమొచ్చింది. కానీ, చదువుకు ఆటంకం కలుగుతుందని నిరాకరించింది.
చదువు పూర్తయ్యాక 2007లో ఇజ్రాయిలీ టీవీ సిరీస్ ‘బుబాట్’లో నటించింది. ఆ తర్వాత గాల్‌కు హాలీవుడ్ యాక్షన్ సినిమాలో నటించే అవకాశమొచ్చింది.
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’లో తొలిసారిగా హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ సిరీస్‌లోని పలు చిత్రాల్లోనూ మెరిసింది. వాటిల్లో కొన్ని స్టంట్స్ తనే స్వయంగా చేయడం విశేషం.
ఇక 2016లో వచ్చిన ‘బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్’లో వండర్ విమెన్‌గా కనిపించి గుర్తింపు తెచ్చుకుంది. డీసీ కామిక్స్‌లో ఈ పాత్ర బాగా పాపులర్.
గాల్‌ని ‘వండర్ విమెన్’గా చేసి 2017లో ప్రత్యేకంగా ఓ సినిమానే రూపొందించింది డీసీ స్టూడియోస్. అది హిట్ కావడంతో 2020లో ‘వండర్ విమెన్ 1984’పేరుతో మరో సినిమా తెరకెక్కించారు.
గాల్ చేసిన ‘వండర్ విమెన్’ పాత్రను ఐక్యరాజ్యసమితి మెచ్చింది. అందుకే ఆ పాత్రకు ‘హానరీ అంబాసిడర్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్’గా గుర్తింపునిచ్చింది.
మొత్తంగా గాల్.. క్రిమినల్, జస్టిస్ లీగ్, రెడ్ నోటీస్, ఫాస్ట్ ఎక్స్ తదితర 20కిపైగా హాలీవుడ్ చిత్రాల్లో, 8 వెబ్‌సిరీస్‌లో నటించింది.
లై, గర్ల్స్ లైక్ యూ, ఇమేజిన్, క్వైట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ గాల్ ఆడిపాడింది. జీటీఏ ఆర్కేడ్ వీడియోగేమ్, రెవ్లాన్, రీబాక్, ఆసుస్, తదితర బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లో నటించింది.
సినిమాల్లోకి రాకముందే గాల్.. ఇజ్రాయెల్‌కే చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యారోన్ వర్సానోను వివాహం చేసుకుంది. వీరికి ఇప్పుడు ముగ్గురు పిల్లలున్నారు. ఇన్‌స్టాలో ఈమెను 106 మిలియన్ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.