టాలీవుడ్‌లో ఎంట్రీ.. హాలీవుడ్‌లో బిజీ

అవంతిక వందనపు.. ప్రస్తుతం హాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసి అక్కడ అదరగొడుతున్న ఈ ఆర్టిస్ట్‌ గురించి ఆసక్తికర విశేషాలు..

తెలుగు మూలాలున్న కుటుంబంలో కాలిఫోర్నియాలో 2005లో పుట్టి, అక్కడే పెరిగింది. చదువుకుంటూనే.. నటనలో శిక్షణ తీసుకుంది. 


2014లో ప్రముఖ టీవీ ఛానల్‌ నిర్వహించిన ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌’ (నార్త్‌ అమెరికన్‌ ఎడిషన్‌)లో రన్నరప్‌గా నిలిచింది.

డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుని, మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో నటిగా మారింది.

మహేశ్‌కు చెల్లిగా నటించి మెప్పించడంతోపాటు సినిమా విడుదల సమయంలో ఆయన్ను ఇంటర్వ్యూ చేసి వ్యాఖ్యాతగాను మార్కులు కొట్టేసింది.


‘మనమంతా’, ‘ప్రేమమ్‌’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘బాలకృష్ణుడు’, ‘ఆక్సిజన్‌’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాల్లోనూ బాల నటిగా మెరిసింది.

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గాను మెప్పించింది. హాలీవుడ్‌ యానిమేషన్‌ సిరీస్‌లు ‘మీరా: రాయల్‌ డిటెక్టివ్‌’, ‘డైరీ ఆఫ్‌ ఏ ఫ్యూచర్‌ ప్రెసిడెంట్‌’లోని పాత్రలకు గాత్రదానం చేసింది.

హాలీవుడ్‌లో నటించాలనే తన ఆశ డిస్నీ సంస్థ ‘స్పిన్‌’ చిత్రంతో నెరవేరింది. ఎన్ని సమస్యలు ఎదురైనా.. అనుకున్న రంగంలో స్థిరపడాలనే అమ్మాయిగా నటించి స్ఫూర్తినింపింది.

ఆ పాత్ర ఆడిషన్‌.. నాలుగు నెలలు జరిగిందట. అక్కడ అవకాశం అందుకోవడం ఎంత కష్టమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2021లో విడుదలైందా చిత్రం.

ఆ తర్వాత ‘భూమిక’ అనే తమిళ చిత్రంలో నటించింది. మరో హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘సీనియర్‌ ఇయర్‌’లో కీలక పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన ‘మీన్స్‌ గర్ల్స్‌’లో కరేన్‌ శెట్టిగా నటించి ఆడియన్స్‌ మనసులు దోచేసింది.

ఆ సినిమా సక్సెస్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమెలో వచ్చిన మార్పులపై మీమ్స్‌ వెల్లువెత్తాయి. ప్రస్తుతం ‘హారర్‌ స్కోప్‌’, ‘ఏ క్రౌన్‌ విషెస్‌’ చిత్రాల్లో నటిస్తోంది. 

తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలురాగా.. గ్లామర్‌ పాత్రలు పోషించే ఆసక్తి ప్రస్తుతానికి లేదని వాటిని తిరస్కరించిందట.

‘హాలీవుడ్‌లో నిర్ణీత సమయంలోనే నటించాలనే రెగ్యులేషన్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌లకు ఉంటుంది. దాంతో చదువుకునేందుకు సమయం లభిస్తుంది. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనూ అలానే ఉంటే ప్రతిభావంతులైన బాల నటులు ఇంకా వస్తారు. పరిశ్రమ కూడా బెటర్‌ అవుతుంది’ అని ఓ సందర్భంలో అభిప్రాయం వ్యక్తం చేసింది. 

కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతం నేర్చుకుంది. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ రాణించింది. హాబీస్‌: పుస్తక పఠనం, వంటలు చేయడం. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, స్పానిష్‌ మాట్లాడగలదు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, స్విమ్మింగ్‌, ఆయిల్‌ పెయింటింగ్‌, బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం పొందింది.

గాలా.. హొయలు అదిరిపోలా

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

మేకప్‌కి దూరంగా.. పాత్రకి దగ్గరగా!

Eenadu.net Home