అయోధ్య ధగ ధగ.. గిన్నిస్‌తో మెరవగా..
బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో దీపావళి సంబరాలు కనులపండువగా జరిగాయి. రెండు గిన్నిస్ రికార్డులను అందుకొని చరిత్ర సృష్టించింది అయోధ్య.
గత ఎనిమిదేళ్లుగా సరయూ నదీతీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈసారి కూడా అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసింది.
అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత వచ్చిన మొదటి దీపావళిని పురస్కరించుకొని 25లక్షలకు పైగా దీపాలను వెలిగించారు.
14ఏళ్ల వనవాసం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన రోజు దీపావళి అని భక్తుల నమ్మకం. అందుకే అక్కడి వారు ఈ పండుగను అయిదు రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు.
బాలరాముణ్ని దర్శించుకొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి అట్టహాసంగా ఉత్సవాన్ని ప్రారంభించారు.
దాదాపు 25,12,585 దీపాల వెలుగులతో మెరిసిన అయోధ్య గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోగా.. 1,121 మంది వేదాచార్యులు ఒకేసారి మహా హారతి నిర్వహించి మరో రికార్డును సృష్టించారు.
దీపోత్సవానికి ముందు ‘పుష్పక విమానం’ తరహాలో రామాయణ వేషధారులు హెలికాప్టరు నుంచి దిగారు. వీరంతా కొలువుదీరిన రథాన్ని సీఎం యోగి, మంత్రులు లాగారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన లేజర్ షో, డ్రోన్ షో, రామాయణ ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయోధ్య అంతటా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో యూపీ కళాకారులే కాకుండా.. మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేసియా, కాంబోడియా, ఇండోనేసియాకు చెందిన కళాకారులు వారి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.