వినియోగదారుడా.. మీకివి తెలుసా?

సంస్థల సేవల్లో లోపాలు, నిర్లక్ష్యం ఉంటే వారిపై ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంటుంది. ఆ హక్కులపై అవగాహన కల్పించేందుకే ఏటా మార్చి 15న వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

అక్రమ వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా వినియోగదారులంతా 1960లో ఉద్యమం చేపట్టారు. దీనికి పరిష్కారంగా భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దాన్ని 2019లో కొత్తగా తీసుకొచ్చారు. 

వస్తువు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం, వస్తువు ఎంపిక, ధరలపై బేరసారాలు, వస్తువుల నష్టం వాటిల్లితే పరిహారం అడిగే హక్కు ఈ చట్టం ద్వారా వినియోగదారులకు లభిస్తుంది.

ఈ చట్టం ఇన్సూరెన్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫైనాన్స్‌ సహా వివిధ రంగాలకు చెందిన సదుపాయాలు, సేవల్లో వినియోగదారులకు అండగా ఉంటుంది. 

వినియోగదారుల హక్కులను కాపాడటం, వారికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించేలా చూడటం, న్యాయం జరిగేలా చేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.

సంస్థల వల్ల నష్టం వాటిల్లితే కన్జ్యూమర్‌ ఫోరమ్‌ ద్వారా కేసు వేసి న్యాయం కోరోచ్చు. నష్ట పరిహారం అడగొచ్చు. ఇందుకోసం కన్జ్యూమర్‌ హెల్ప్‌లైన్‌ను ఫోన్‌ చేయొచ్చు.

ఫిర్యాదులో వినియోగదారు వివరాలు, సమస్య, దానికి తగిన ఆధారాలను జత చేయాల్సి ఉంటుంది. నష్ట తీవ్రతను బట్టి జిల్లా ఫారమ్‌/రాష్ట్ర/జాతీయ కన్జ్యూమర్‌ కమిషన్‌లు విచారణ చేపడతాయి. 

జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్‌ (ncdrc)జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. నష్ట పరిహారం విలువ రూ. పదికోట్లు దాటిన కేసులను ఇక్కడ పరిష్కరిస్తారు.

నష్టపరిహారం రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల మధ్య ఉండే కేసుల్ని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (scdrc) విచారిస్తుంది.

జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (dcdrf)లో రూ. కోటి కంటే తక్కువ నష్టపరిహారం కేసుల్ని పరిష్కరిస్తుంది.

సంస్థల వల్ల నష్టపోయిన వ్యక్తులు తమ కేసుపై న్యాయవాదిని నియమించుకొని లేదా స్వయంగా వాదించుకోవచ్చు. అయితే, వాదనలు హేతుబద్ధంగా ఉండాలి.

వినియోగదారుడు కేసు దాఖలు చేసినప్పుడు.. కోర్టు ముందుగా కొనుగోలుదారు తనకు జరిగిన నష్టాన్ని ఆధారాలతో నిరూపించగలరా లేదా చూస్తారు. లేనిపక్షంలో వినియోగదారులకి పూర్తి స్థాయిలో న్యాయం జరగదు.

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

ట్రావెల్‌ డిటెక్టివ్‌.. ఆన్వీ కామ్‌దార్‌

Eenadu.net Home