‘హను-మాన్‌’ గురించి మీకివి తెలుసా?

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన పాన్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో మూవీ ‘హను-మాన్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదల కానుంది. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రానున్న దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన విశేషాలు.

‘అ!’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు ప్రశాంత్‌ వర్మ. ‘జాంబిరెడ్డి’ తర్వాత మళ్లీ తేజ సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది.

తక్కువ బడ్జెట్‌తో పూర్తిస్థాయి తెలుగు చిత్రంగా ‘హను-మాన్‌’ను తీర్చిదిద్దాలని ప్రశాంత్‌ భావించారు. నిర్మాత సపోర్ట్‌తో పాన్‌ వరల్డ్‌ మూవీగా దీనిని సిద్ధం చేశారు. దాదాపు 11 భాషల్లో ఇది విడుదల కానుంది.

ఈ సినిమా కోసం అంజనాద్రి అనే ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ఊరు చుట్టూనే కథ తిరుగుతుంది. దానిని రక్షించడం కోసం హనుమంతు (తేజ) ఏం చేశాడన్నదే కథ.

2021 జూన్‌ 25న ఈ సినిమా పట్టాలెక్కింది. వట్టినాగులపల్లిలో స్థలాన్ని లీజ్‌కు తీసుకుని షూట్‌ చేశారు. హనుమాన్‌ స్టూడియోగా స్థానికంగా అది ఆదరణ సొంతం చేసుకుంది.

కోటి (వానరం) పాత్రకు నటుడు రవితేజ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. కోటి డైలాగ్స్‌ వెటకారంగా ఉంటాయి. రవితేజ వాయిస్‌ మాత్రమే ఆ తరహా డైలాగ్స్‌కు సెట్‌ అవుతుందని టీమ్‌ భావించింది.

మొత్తం 1600 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉంటాయి. వానరం, ఎలుకలు, చిరుత, పులిని చూపించడం వీఎఫ్‌ఎక్స్‌ వల్లే సాధ్యమైందని ప్రశాంత్‌ చెప్పారు. బడ్జెట్‌కు అనుగుణంగా కొత్తతరం వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌తో వర్క్‌ చేశారు.

అనుదీప్‌, గౌరహరి, కృష్ణ అనే ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్స్ దీని కోసం వర్క్‌ చేశారు.

హనుమంతుడిగా చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం. సినిమా చూసి ఆ విషయం తెలుసుకోవాలని టీమ్‌ బదులిచ్చింది.

‘వాన’ హీరో వినయ్‌ రాయ్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. 

‘హను - మాన్‌’ మొత్తం ఫుటేజీ నిడివి 2.40 గంటలు. సెన్సార్‌ అనంతరం 2.38 గంటలు అయ్యింది. సినిమాకు ఏది అవసరమో దానిని షూట్‌ చేశామని ప్రశాంత్‌ తెలిపారు. 

ScriptsVille పేరుతో యువ రచయితల కోసం టీమ్‌ ప్రారంభించారు ప్రశాంత్‌. తన వద్ద దాదాపు 30 నుంచి 40 కథలు ఉన్నాయన్నారు. హను-మాన్‌ ఫలితం చూసి వాటిని పట్టాలెక్కిస్తానని తెలిపారు. ‘హను-మాన్‌’తోపాటు మరో చిత్రాన్నీ పూర్తి చేశారు ఈ సినిమా విడుదలయ్యాక దాని గురించి ప్రకటిస్తానని చెప్పారు.

అగ్ర హీరోలతో దుషారా

ధనుష్‌.. ఓ ఇన్‌స్పిరేషన్‌

శ్రుతి హాసన్ @ 15.. ఈ విషయాలు తెలుసా?

Eenadu.net Home