హవాయి.. వింతలు చూడవోయి!

పర్యాటకుల్ని ఆకర్షించే ప్రాంతాల్లో.. హవాయి ముందువరుసలో ఉంటుంది. చుట్టూ సముద్రం.. ప్రకృతి అందాలతో ఆకట్టుకునే అమెరికాలోని ఈ రాష్ట్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

(Photos: RKC)

హవాయి అనేది వందకుపైగా అగ్నిపర్వత ద్వీపాల సమూహం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటి. అమెరికా భూభాగానికి 3,200కి.మీ దూరంలో.. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉంటుంది. 

ఇక్కడి విస్తీర్ణం ఏటా దాదాపు 40 ఎకరాలు పెరుగుతోందట. కారణం.. ఇక్కడున్న అగ్నిపర్వతాల నుంచి బయటకొస్తున్న లావా చల్లబడిన తర్వాత నేలగా మారిపోతోంది. 

హవాయిలో జరిగే వేడుకల్లో అందరూ పూలమాల ధరిస్తుంటారు. ఎవరైనా పూలమాల వేసుకోవడానికి నిరాకరిస్తే.. వారితో కఠినంగా వ్యవహరించినట్లు భావిస్తారు. 

ఈ రాష్ట్రానికి ప్రత్యేక టైమ్‌ జోన్‌(హవాయి-అల్యూషన్‌ టైమ్‌ జోన్‌) ఉంది. యూనివర్సల్‌ టైమ్‌ జోన్‌కు సరితూగేలా దాదాపు 10 గంటల సమయాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. 

ఇక్కడ రోడ్లకు ఇరువైపులా హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలు కనిపించవు. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వీలుగా.. వీటిని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. వెర్మంట్‌, అలస్కా, మైనె రాష్ట్రాల్లోనూ వీటిని నిషేధించారు. 

జూరాసిక్‌ పార్క్‌, జుమాంజీ: వెల్‌కమ్‌ టు ది జంగిల్‌, గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌ తదితర హాలీవుడ్‌ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను హవాయిలోనే చిత్రీకరించారు. 

ఇక్కడి కోవై ద్వీపంలో ఏ ఇల్లూ కొబ్బరి చెట్టు ఎత్తుకు మించి ఉండకూడదు. ఈ ప్రాంతంలో మెక్‌డొనాల్డ్స్‌, కేఎఫ్‌సీ వంటి ఏ ఫుడ్‌ చెయిన్‌ రెస్టారంట్‌ లేదు. 

కాఫీ సాగు చేసే ఒకే ఒక్క యూఎస్‌ రాష్ట్రం హవాయి. ఇక్కడ కాఫీతోపాటు చెరకు, అరటిపండ్లు, పైనాపిల్‌ పండిస్తారు. 

ప్రపంచంలో ఎల్లప్పుడూ తడిగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన మౌంట్‌ వైలేల్‌ హవాయిలోనే ఉంది. ఇక్కడ ఏటా 450 అంగుళాల వర్షపాతం నమోదవుతుంటుంది. 

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా జన్మించింది.. హవాయి రాజధాని హోనోలులులో. అమెరికా భూభాగానికి చెందని వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడు కావడం అదే తొలిసారి. 

సాధారణంగా పోస్టాఫీసుల ద్వారా పోస్ట్‌కార్డులు పంపిస్తుంటాం. అదే హవాయిలో కొబ్బరిబొండాలను కూడా పోస్టల్‌లో పంపించొచ్చు. 

అమెరికాకు అధికార భాష అంటూ లేదు. కానీ, హవాయిలో వారి మాతృభాష హవాయియన్‌, ఇంగ్లీష్‌ అధికారిక భాషలుగా ఉన్నాయి. ఇంగ్లీష్‌లో అక్షరాలు 26 ఉంటే.. హవాయిలో మాట్లాడే ఇంగ్లీష్‌లో కేవలం 13 మాత్రమే(A, E, I, O, U, H, K, L, M, N, P, W,')ఉంటాయి. 

అలలపై చేసే సర్ఫింగ్‌కు పుట్టినిల్లు హవాయి. రాజుల కాలం నుంచే ఈ క్రీడను ఆడేవారట. ఇక్కడి నుంచే ఈ ఆట.. ప్రపంచమంతా వ్యాపించిందని చెబుతుంటారు.

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home