వరల్డ్ పోస్టల్ డే.. అక్టోబర్ 9
మెయిల్స్, మొబైల్స్ వచ్చాక ఉత్తర ప్రత్యుత్తరాలు తగ్గిపోయాయి. అయినా.. అధికారిక లేఖలు, ఉత్తర్వులను ప్రజలకు చేరవేస్తూ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర సేవలు అందిస్తోంది. అక్టోబర్ 9న వరల్డ్ పోస్టల్ డే. కొన్ని ఆసక్తికర విషయాలు..
భారత్‌లో తొలిసారిగా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1727లో పోస్టాఫీస్ ఏర్పాటు చేసింది. 1774లో కోల్‌కతాలో జీపీఓను స్థాపించింది.
స్వతంత్ర భారత్‌లో పోస్టల్ స్టాంప్‌పై ముద్రించిన తొలి భారతీయుడి చిత్రం మహాత్మాగాంధీదే. 1948లో మొదటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ స్టాంప్‌లను విడుదల చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఏర్పాటైన పోస్టాఫీస్ భారత్‌లోనే ఉంది. హిమాచల్‌ప్రదేశలోని హిక్కిం అనే గ్రామంలో సముద్రమట్టానికి 4,724 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీస్‌గా గిన్నిస్ బుక్‌లో కూడా చోటు దక్కించుకుంది.
ప్రాంతాలవారీగా ఉత్తరాల విభజనను సులభతరం చేసేందుకు 1972లో కేంద్ర సమాచారశాఖ ఆరు అంకెల పిన్(పోస్టల్ ఇండెక్స్ నంబర్) కోడ్ వ్యవస్థను తీసుకొచ్చింది.
పిన్‌కోడ్‌లోని తొలి అంకె జోన్‌ను, రెండో అంకె సబ్ జోన్‌ను, మూడో అంకె జిల్లాను, చివరి మూడు అంకెలు పోస్టాఫీస్‌ను సూచిస్తాయి.
డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో తపాలా శాఖ 2013లో టెలిగ్రామ్ సేవల్ని నిలిపివేసింది. మనీ ఆర్డర్ సేవల్నీ ఎలక్ట్రానిక్ విధానంలో అందిస్తోంది. కంప్యూటరైజ్డ్ కానీ పోస్టాఫీస్‌లున్న ప్రాంతాల్లో ఇంకా సంప్రదాయ మనీ ఆర్డర్ సేవలు కొనసాగుతున్నాయి.
నీటిలో తేలియాడే ఏకైక పోస్టాఫీస్ శ్రీనగర్‌లో ఉంది. దాల్ సరస్సుపై దీన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో పోస్టల్ శాఖకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది.
అలాగే పోస్టల్ సేవలకు అవసరమయ్యే స్టాంప్స్ ఇతర స్టేషనరీ వస్తువులను భారత్ స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, పోర్చుగల్, ఇథియోపియా దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది.
దేశంలోనే తొలి ‘త్రీడీ ప్రింటెడ్’ పోస్టాఫీసు కర్ణాటకలోని బెంగళూరులో ప్రారంభించారు. ‘త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ’ సాయంతో కేవలం 45 రోజుల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేయడం విశేషం.