జస్లీన్ రాయల్.. మ్యూజిక్ క్వీన్!
సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మహిళలు సంగీత దర్శకులుగా ఉన్నారు. వారిలో ఒకరు.. జస్లీన్ రాయల్.
(Photos:Instagram/jasleen royal)
సంగీతం సమకూర్చడమే కాదు, పాటలు రాసి పాడుతుంది కూడా. అన్ని రకాల సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యముందీ భామకి.
ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ‘హీరియే’ అనే మ్యూజిక్ వీడియో రూపొందించింది. మ్యూజిక్ కంపోజ్ చేయడంతోపాటు పాటలో దుల్కర్‌తో కలిసి నటించింది.
హీరోయిన్లతో పోటీ పడే అందంతో ఆకట్టుకునే ఈ బ్యూటీ.. పూర్తి పేరు జస్లీన్ కౌర్ రాయల్. పంజాబ్‌లోని లుధియానాలో జులై 8, 1991లో జన్మించింది. దిల్లీలోని హిందూ కాలేజ్‌లో బీ.కామ్ డిగ్రీ పూర్తి చేసింది.
చిన్న వయసు నుంచే జస్లీన్‌కు సంగీతంపై మక్కువ. ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు గానీ.. చక్కగా పాడుతూ అందరినీ ఆకట్టుకునేది.
తను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ‘ఇండియాస్ గాట్ టాలెంట్(2009)’లో పాల్గొని సెమీఫైనల్ వరకు వెళ్లింది. పాట పాడుతూ తనే గిటార్, మౌత్ ఆర్గాన్, ఫ్లూట్, కీబోర్డ్ ఇలా అన్ని వాయిద్యాల్ని సునాయాసంగా వాయించింది.
జస్లీన్ తొలిసారిగా కంపోజ్ చేసి పాడిన ‘పాంచి హో జావా’ పాటకు 2013లో ఎంటీవీ వీడియో మ్యూజిక్ నుంచి బెస్ట్ ఇండీ సాంగ్ అవార్డు దక్కింది.
ఇక 2014లో ‘ఖుబ్‌సూరత్’ చిత్రంతో బాలీవుడ్ మ్యూజిక్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ‘ప్రీత్’అంటూ సాగే పాట పాడింది.
అప్పటి నుంచి జస్లీన్.. వెనుదిరిగి చూసుకోలేదు. ‘బద్లాపూర్’, ‘బార్‌బార్ దేఖో’, ‘శివాయ్’, ‘ఫక్రీ రిటర్న్స్’, ‘వీర్ ది వెడ్డింగ్’, ‘గల్లీ బాయ్’, ‘కేసరి’, ‘రన్‌వే 24’ తదితర చిత్రాల్లో పాటలు పాడటంతోపాటు కొన్ని సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసింది.
ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణి కలిసి నటించిన ‘షేర్షా’లో ‘రాంజా’ పాటను జస్లీనే కంపోజ్ చేసి పాడింది.
‘షేర్షా’కు గానూ జస్లీన్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్ ఈమెనే కావడం విశేషం.
ఓవైపు సినిమాలకు సంగీతం అందిస్తూనే.. మ్యూజిక్ వీడియోలు చేస్తోంది. హిందీతోపాటు పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, ఇంగ్లిష్‌లోనూ పాటలు కంపోజ్ చేస్తూ పాడుతోంది.
ఈ బ్యూటీకి తన పేరు మీదే ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులోనే ‘హీరియే’ పాట విడుదల చేయగా.. రెండు వారాల్లో 16 మిలియన్ వ్యూస్ వచ్చాయి.