పోలెండ్‌కు ప్రధాని.. ఆ దేశం విశేషాలివీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలెండ్‌ పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!

భౌగోళికంగా పోలెండ్‌ యూరప్‌ ఖండం మధ్యభాగంలో ఉంటుంది. జనాభా 3.8 కోట్లు. కరెన్సీని జోటీ అంటారు. ఒక జోటీ రూ. 21.75తో సమానం.

పోలెండ్‌కు ఆ పేరు పోలనీ అనే స్లావిక్‌ తెగ నుంచి వచ్చింది. పోలనీ అంటే పచ్చిక బయళ్లు, ఖాళీ స్థలాల్లో నివసించే ప్రజలు అని అర్థం.

ఈ దేశం పేరు వినగానే గుర్తొచ్చేవి అందమైన కోటలు. ప్రపంచంలోనే అత్యధిక కోటలు ఉన్న ప్రాంతంగా పేరొందింది. అంతేకాదు, పచ్చని బయళ్లు, ఎడారులు, లెక్కలేనన్ని సరస్సులతో ఈ దేశం పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. 

ప్రపంచంలోనే అతి పెద్ద ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ఈ దేశంలోనే జరుగుతుంది. ‘పోలెండ్‌రాక్‌’ పేరుతో ఏటా ఆగస్టు మొదటి వారంలో జరిగే ఈ వేడుకకి దాదాపు 6 లక్షల మంది హాజరవుతారు. 

పోలెండ్‌ రాజధాని వార్సా నగరం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడున్నది.. పునర్‌నిర్మించిన ఆధునిక నగరం. 

1772 తర్వాత 123 ఏళ్ల పాటు ప్రపంచ పటంలో పోలెండ్‌ కనిపించలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఈ దేశాన్ని రష్యా, ప్రష్యా, ఆస్ట్రియా మూడు భాగాలుగా పంచుకున్నాయి. 

ఈ దేశంలో స్థానిక విద్యార్థులకు ఉన్నత చదువు ఉచితం. విదేశీ విద్యార్థులు స్వల్ప మొత్తంలో ఫీజులు చెల్లించి చదువుకోవచ్చు.

ఇక్కడ నోబెల్‌ బహుమతి గ్రహీతలు 18 మంది ఉన్నారు. రసాయనిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ, విశ్వానికి కేంద్రం భూమి కాదని ప్రతిపాదించిన కోపర్నికస్‌ ఇక్కడి శాస్త్రవేత్తలే. 

విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోట ‘ క్యాస్టిల్‌ఆఫ్‌ ట్యూటోనిక్‌ ఆర్డర్‌’ పోలెండ్‌లోని మాల్బర్క్‌లో ఉంది. 13వ శతాబ్దంలో 52 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. 

వీలిక్జా, బోకిన సాల్ట్‌ మైన్స్‌, బియలోవిజా ఫారెస్ట్‌, హిస్టారిక్‌ సెంటర్‌ ఆఫ్‌ వార్సా, ఓల్డ్‌ సిటీ ఆఫ్‌ జామోస్‌, మల్‌బర్క్‌ క్యాస్టిల్‌, సెంటినియల్‌ హాల్‌ సహా 17 కట్టడాలు యునెస్కో వారసత్వ సంపద జాబితాలో ఉన్నాయి.

ప్రపంచంలో తలకిందులుగా నిర్మించిన తొలి భవనం ఇక్కడే ఉంది. ఈ రెండంతస్థుల భవనాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారు. 

సమోసాకీ ఓ రోజుంది!

బిర్యానీ రుచిగా రావాలంటే.. ఈ టిప్స్‌ ట్రై చేయండి..

ఉపాధ్యాయ దినోత్సవం(SEP 5).. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సూక్తులు!

Eenadu.net Home