#eenadu
సంక్రాంతి అంటే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో హడావుడి చేస్తుంటాం. ప్రకృతి పండుగగా పిలుచుకునే సంక్రాంతికి రంగురంగుల ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసుకుందామా..!
పూర్వీకులు సూర్యుణ్ణి ఆరాధించడం కోసం నేలపై రకరకాల చిత్రాలు గీసేవారట. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిని అలంకరించేవారు. అదే సంప్రదాయంగా మారింది.
లక్ష్మీదేవి తెల్లవారుజామునే వీధిలో సంచరిస్తుందట. ఆ సమయంలో ఎవరి ఇంటి ముందైతే ముగ్గులు వేసి చక్కగా అలంకరిస్తారో వారింట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
సూర్యోదయానికల్లా ఎవరయితే ఇంటిముందర కళ్లాపి చల్లి, ముగ్గులతో చక్కగా అలంకరిస్తారో వాళ్లకి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్న విశ్వాసం.
ముగ్గును ఎక్కువగా బియ్యం పిండితో వేస్తారు. దీనితో అనేక రకాల కీటకాలు, పక్షులు ఆహారం లభిస్తుంది. ఇంట్లోకి దుష్టశక్తులు కూడా ప్రవేశించవని నమ్ముతారు.
సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలంలో తెల్లవారక ముందే ముగ్గులు పెడతారు. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుపై పెట్టి వాటిల్లో నవధాన్యాలు, కూరగాయలు పెడతారు. ఇవి జీవితంలో చీకట్లను తరిమేసి వెలుగులు నింపుతాయని హిందువుల నమ్మకం.
రంగులతో అలంకరించిన ముగ్గులను పదే పదే చూడడం మూలంగా మనసు ప్రశాంతంగా మారుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి దూరమవుతాయి.
ఉదయాన్నే వాకిట్లో కళాపి చల్లి ముగ్గులు వేస్తే అదొక చక్కని వ్యాయామం. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఇదీ ఇక కారణమే.
ముగ్గులు వేయడం ఓ కళ. సృజనాత్మక ప్రక్రియ. విభిన్న రకాల ముగ్గులు వేసి, ఆకట్టుకునే రంగులు నింపడం.. ఓచక్కటి ఆసక్తిని పెంపొందించుకోవడమే..