ఆహా.. సమోసా..!

వేడి వేడి సమోసాఅంటే ఇష్టపడని వారుండరు. చిరుజల్లులు కురుస్తున్న సమయాల్లో గరంగరంగా ఏదైనా తినాలనిపిస్తే టక్కున గుర్తొచ్చేది సమోసానే. ఇది ఫుడ్‌కాదు.. చాలా మందికి ఓ ఎమోషన్‌! సెప్టెంబర్‌ 5న ప్రపంచ సమోసా దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు..

మన దేశంలో ఎక్కడకెళ్లినా వివిధ వెరైటీల్లో చేసిన సమోసాలు ఆహార ప్రియుల నోరూరిస్తుంటాయి. భారతీయులంతా ఎంతో ఇష్టపడి తినే ఈ వంటకం ఇక్కడే పుట్టిందని అనుకుంటుంటాం. కానీ, ఇది పశ్చిమాసియా నుంచి మన దేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది.

పర్షియన్‌ పదం ‘సనూబాబాద్‌’ నుంచి సమోసా అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. 10వ శతాబ్దానికి ముందే పశ్చిమాసియా దేశాల్లో సమోసాలు ఉండేవట. 13 లేదా 14వ శతాబ్దంలో వర్తకం కోసం వచ్చిన వ్యాపారులు వీటిని భారత్‌కు తీసుకురాగా.. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యాయి. 

గోధుమ లేదా మైదా పిండి మిశ్రమానికి స్థానిక మసాలాలు, ఉల్లిపాయలు, బఠానీలు, ఉడికించిన బంగాళా దుంపలను జత చేసి చేసిన ఈ చిరుతిండిని వ్యాపారులు ఇళ్లల్లో తయారు చేసి.. దుకాణాల్లో విక్రయిస్తుంటారు. 

వంటల్లో సరికొత్త ప్రయోగాలతో ఆహార ప్రియుల్ని అలరించేవారు సమోసాలనూ రొటీన్‌కు భిన్నంగా అందిస్తున్నారు. అందువల్ల సమోసాలు విభిన్న రుచుల్లో ఊరిస్తున్నాయి.

ఒకప్పుడు కూరగాయలతో మామూలుగా తయారు చేసే ఈ సమోసాల్లో ఇప్పుడు నయా ట్రెండ్‌ కొనసాగుతోంది. తొలుత సమోసాలో ఉల్లి, చికెన్‌, మొక్కజొన్న గింజలు స్టఫ్‌గా చేరుస్తూ వచ్చేవారు. 

ఇప్పుడైతే బిర్యానీ, చాక్లెట్‌, ఛీజ్‌, పుట్టగొడుగులు, డ్రైఫ్రూట్స్‌, పాలక్‌పన్నీర్‌, గులాబ్‌ జామున్‌.. ఇలా ఒకటేమిటి విభిన్న రుచులతో లభ్యమవుతోన్న సమోసాలు ఆహా అనిపిస్తున్నాయి.

కారం, తీపి.. ఇలా విభిన్న రుచులతో నోరూరిస్తోన్న ఈ సమోసా పేరిట ఓ గిన్నిస్‌ రికార్డు కూడా ఉంది. 2017లో లండన్‌లో 153 కిలోల అతిపెద్ద సమోసా గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది.

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home