షకీరా.. సంగీత సాగరంలో సితార
వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ షకీరా విగ్రహాన్ని ఈమె స్వస్థలమైన కొలంబియాలోని బారన్‌కిల్లాలో అక్కడి ప్రజలు ఏర్పాటు చేశారు. 21.3 అడుగుల ఎత్తున్న ఆ విగ్రహం ఫొటోను షకీరా సోషల్‌మీడియాలో పంచుకుంది. 2006లోనూ ఒక విగ్రహాన్ని స్థానిక పార్క్‌లో ఆవిష్కరించారు.
మ్యూజిక్ రంగంలో చాలాకాలంగా స్టార్ సింగర్‌గా కొనసాగుతోన్న షకీరాకి ప్రస్తుతం 46 ఏళ్లు. అయినా తగ్గేదేలే అంటూ పాటలతో ఆకట్టుకుంటోంది. వయసు పెరిగినా తనకున్న క్రేజ్ అస్సలు తగ్గలేదు.
‘క్వీన్ ఆఫ్ లాటిన్ మ్యూజిక్’గా గుర్తింపు తెచ్చుకున్న షకీరా పూర్తి పేరు ఏంటో తెలుసా? షకీరా ఇసబెల్ బెబారాక్ రిపోల్. చివరి రెండు పదాలు తన తల్లిదండ్రుల ఇంటి పేర్లు.
ఈమె ఫిబ్రవరి 2, 1977లో జన్మించింది. ఎనిమిదేళ్ల వయసులో సొంతగా పాట రాసి పాడింది. 13వ ఏటా ‘సోనీ మ్యూజిక్ కొలంబియా’తో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
మొదట్లో సింగర్‌గా ఎదగడానికి ఇబ్బంది పడ్డా.. 2001లో రూపొందించిన ‘వెనెవర్.. వేరెవర్’ పాట సంచలనం సృష్టించింది. అంతర్జాతీయంగా షకీరాకి పాపులారిటీ తెచ్చిపెట్టింది.
This browser does not support the video element.
పాటలతోనే కాదు.. తన బెల్లీ డ్యాన్స్‌తో యూత్‌ను కట్టిపడేస్తుంటుంది. ఎక్కడ కన్సర్ట్ ఏర్పాటు చేసినా ఈమె డ్యాన్స్ చూసేందుకు అభిమానులు ఎగపడుతుంటారు.
ఇప్పటి వరకు షకీరా 11 స్టూడియో ఆల్బమ్స్, 5 లైవ్ ఆల్బమ్స్, 5 కాంప్లిటేషన్ ఆల్బమ్స్, 62 మ్యూజిక్ వీడియోలు, 82 సింగిల్ పాటలు రూపొందించింది. తను పాడిన చాలా పాటలు సొంతగా రాసుకున్నవే.
This browser does not support the video element.
ఫిఫా ప్రపంచకప్ -2010 కోసం షకీరా ‘వకా వకా (దిస్ టైమ్ ఫర్ ఆఫ్రికా)’ మ్యూజిక్ వీడియో రూపొందించింది. ఆ పాట ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. ప్రపంచకప్ కోసం రూపొందించిన పాటల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన పాట ఇదే.
‘వకా వకా’, ‘హిప్స్ డోంట్ లై’, ‘చంటాజె’, ‘బ్యూటీఫుల్ లయర్’, ‘గర్ల్ లైక్ మి’, ‘లా లా లా’ తదితర పాటలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్ (‘వకా వకా’, ‘చంటాజె’ రెండు పాటలు కలిపి) సాధించిన తొలి సింగర్ షకీరానే.
మ్యూజిక్ రంగంలో ప్రతిష్టాత్మక పురస్కారం గ్రామీ సహా 500 అవార్డులు అందుకుంది షకిరా. ఈమె ఖాతాలో 5 గ్రామీ, 14 లాటిన్ గ్రామీ అవార్డులున్నాయి.
ఇంగ్లిష్, స్పానీష్, పోర్చుగీస్, ఇటాలీయన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే షకీరా.. పలు సినిమాల్లోనూ నటించింది. టీవీషోల్లోనూ పాల్గొంది. ఈమెపై పలు డాక్యుమెంటరీలు కూడా చిత్రీకరించారు.
వ్యక్తిగత జీవితానికొస్తే.. 2000లో అర్జెంటీనాకు చెందిన లాయర్ అంటొనియో డి లా రువాతో సహజీవనం చేసి విడిపోయింది. అనంతరం స్పానీష్ ఫుట్‌బాల్ ప్లేయర్ గెరార్డ్ పిక్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే, 2022లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.
షకీరా ‘బేర్‌ఫుట్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోంది. కొలంబియాలోని పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేసింది.
ఈమెను ఇన్‌స్టాలో 90.4 మిలియన్, ఫేస్‌బుక్‌లో 124 మిలియన్, ఎక్స్(ట్విటర్)లో 53.7 మిలియన్ నెటిజన్లు ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లో 45.3 మిలియన్ సబ్‌స్ర్కయిబర్లున్నారు.
Images: shakira/instagram