పుస్తకం రాస్తోన్న ‘డిజిటల్’ బ్యూటీ
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రజక్తా కోలీ.. రచయిత అవతారం ఎత్తనుంది. ‘టూ గుడ్ టు బి ట్రూ’ పేరుతో ఓ పుస్తకం రాయనున్నట్లు ప్రకటించింది.
(Photos: Instagram/Prajakta Koli)
ఇంతకీ ఈమె ఎవరంటే.. భారత్‌లోనే అత్యధిక సబ్‌స్ర్కయిబర్స్ ఉన్న లేడీ యూట్యూబర్. ‘మోస్ట్‌లీసేన్’యూట్యూబ్ ఛానల్‌లో కామెడీ, సరదా ముచ్చట్ల వీడియోలను పోస్టు చేస్తుంటుంది.
పుణెలో పుట్టి పెరిగిన ప్రజక్తకు చిన్నప్పట్నుంచే రేడియో జాకీ అవ్వాలని కోరిక ఉండేదట. దానికనుగుణంగానే మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది.
ఇంటర్న్‌గా ఓ ఎఫ్.ఎం. రేడియో స్టేషన్‌లో పనిచేసింది. ఆ తర్వాత ఈమెకు అక్కడి పనితీరు నచ్చక.. బయటకొచ్చేసింది.
తనే 2015లో సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు రూపొందించడం మొదలుపెట్టింది. రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలు, సన్నివేశాల్నే కామెడీగా చెబుతూ నెటిజన్లను ఆకట్టుకుంది.
మొదట్లో కొన్ని విమర్శలు.. కించపర్చే కామెంట్లు వచ్చినా.. అవేవీ పట్టించుకోకుండా వీడియోలు రూపొందిస్తూ సబ్‌స్ర్కయిబర్స్‌ను పెంచుకుంది.
తను ఛానెల్ ప్రారంభించిన మూడు నెలల్లోనే 30వేల సబ్‌స్ర్కయిబర్స్‌ను సొంతం చేసుకున్న ప్రజక్త.. 2018లో 1 మిలియన్ సబ్‌స్ర్కయిబర్స్‌ను సాధించిన తొలి మహిళా కామెడీ క్రియేటర్‌గా నిలిచింది.
ప్రస్తుతం ప్రజక్త యూట్యూబ్ ఛానల్‌కి 7.06 మిలియన్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాలోనూ ఈమెను 7.8 మిలియన్ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
ఈ ఇన్‌స్టా బ్యూటీ 2020లో ‘ప్రెట్టీ ఫిట్’ పేరుతో ఓ సిరీస్ మొదలుపెట్టి నేహా కక్కర్, కరీనా కపూర్, శాన్యా మల్హోత్రా తదితర సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది.
‘షేమ్‌లెస్’, ‘నో అఫెన్స్’, ‘యే దిస్ గానా హై’ తదితర మ్యూజిక్ వీడియోల్లో మెరిసి ఆకట్టుకుంది.
తనకున్న క్రేజ్‌తో నటించే అవకాశాలూ వచ్చాయి. అలా ‘కయాలీ పులావ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో, ‘మిస్‌మ్యాచ్‌డ్’ వెబ్‌సిరీస్‌లో, ‘జుగ్ జుగ్ జియో’ సినిమాలో నటించింది.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా ప్రజక్త ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ రూపొందించిన ‘30 అండర్ 30’, ‘ఎంటర్‌ప్రూనర్ ఇండియాస్ లిస్ట్ ఆఫ్ 35 అండర్ 35’ జాబితాల్లో చోటు దక్కించుకుంది.
ఈ ఏడాది జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో వివిధ దేశాలకు చెందిన యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. ఆ సదస్సుకు భారత్ తరఫున ప్రజక్త హాజరైంది.
ఇప్పటి వరకు డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా, నటిగా, బ్లాగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సోషల్‌మీడియా బ్యూటీ.. ఇప్పుడు రచయితగానూ తన ప్రతిభ చాటేందుకు సిద్ధమవుతోంది. 2024లో తన బుక్ విడుదలకానుంది.