మొదట్లో నాన్న నన్ను నమ్మలేదు..!

రింకు సింగ్‌.. స్టార్‌ ప్లేయర్‌గా ఎదుగుతున్న యువ క్రికెటర్‌. గత కొంతకాలంగా స్థిరంగా బ్యాటింగ్‌ చేస్తూ టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తనదైన ఆటతీరుతో జాతీయజట్టులో చోటు సంపాదించాడు.

పేద కుటుంబం నుంచి వచ్చి భారత్‌కు ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగిన రింకు జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

రింకు.. 1997 జనవరి 12, న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జన్మించాడు. అతడి తండ్రి ఖాన్‌చంద్ర ఇళ్లకు గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ చేస్తుంటారు. గ్యాస్‌ కంపెనీ కేటాయించిన ఇరుకైన రెండు గదుల ఇంట్లోనే రింకు కుటుంబం నివసించేది.

చిన్నతనం నుంచి రింకుకి క్రికెట్‌ అంటే ఇష్టం. స్పోర్ట్స్‌ కోటాలో స్థానిక దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ కూడా లభించింది. కానీ, అతడికి చదువుపై ఆసక్తి లేదు. తొమ్మిదో తరగతి ఫెయిల్‌కావడంతో చదువుకు స్వస్తి చెప్పాడు.

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా క్రికెటర్‌ అవ్వాలన్న రింకు ఆశయాన్ని తండ్రి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు. తల్లి కూడా ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబానికి సాయపడాలని కోరేవారట.

తన సోదరుడు పనిచేసే కోచింగ్‌ సెంటర్‌లోనే స్వీపర్‌గా ఉద్యోగం వస్తే.. దాన్ని రింకు తిరస్కరించాడు. తన జీవితాన్ని మార్చేది క్రికెట్‌ మాత్రమేనని నమ్మి.. మొండి ధైర్యంతో ముందడుగేశాడు. 

ఓ క్రికెట్‌ టోర్నమెంట్‌లో రింకు అద్భుతమైన ప్రదర్శన కనబర్చి బైక్‌ గెలుచుకున్నాడు. దాన్ని తన తండ్రికి బహుమతిగా ఇవ్వడంతో.. రింకు ప్రతిభపై తండ్రికి నమ్మకం కలిగింది.

మూడుసార్లు విఫలయత్నం చేసి 2016లో ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున అండర్‌-16 దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అండర్‌-19, అండర్‌-23 విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చాడు. 2018-19 రంజీలో టాప్‌- 3 బ్యాటర్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌-2017లో పంజాబ్‌ కింగ్స్‌ రింకుని రూ. 10లక్షలు పెట్టి జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్‌ చేసే అవకాశం మాత్రం రాలేదు. మరుసటి ఏడాది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని రూ. 80లక్షలకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌ కెరీర్‌ ప్రారంభంలో రింకు రాణించింది తక్కువే. కొన్నిసార్లు ఆడే అవకాశం రాలేదు. మరికొన్నిసార్లు అవకాశం వచ్చినా ఆటలో విఫలమయ్యాడు. కీళ్ల గాయంతో కొంత కాలం ఆటకు దూరమయ్యాడు. 

2022 నుంచి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ సత్తాచాటుతున్నాడు. 2023 సీజన్‌లో బెస్ట్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. గుజరాత్‌పై రింకు కొట్టిన ఐదు సిక్సులు సీజన్‌కే హైలైట్‌గా నిలిచాయి.

 2023 ఆగస్టులో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. నవంబర్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో 14 బంతుల్లో 22 పరుగులు, రెండో టీ20లో 9 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 

This browser does not support the video element.

రింకుకి క్రికెట్‌ మాత్రమే కాదు ఇతర క్రీడలు కూడా ఆడటమంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుంటాడు. 

ఈ యూపీ బ్యాటర్‌ కుడి చేతిపై టాటూలు ఉన్నాయి. పక్షి బొమ్మ, ఫ్యామిలీ పదం, 2.26గంటల సమయం చూపించే గడియారం (2018లో కేకేఆర్‌ జట్టు తనని జట్టులోకి తీసుకున్న సమయం) కనిపిస్తాయి.

రింకుకి క్రికెట్‌లో సచిన్‌ తెందూల్కర్‌, సురేశ్‌ రైనా.. సినిమాల్లో హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌, షారుక్‌ ఖాన్‌ అంటే అభిమానం. 

ఐపీఎల్.. ఏ సీజన్‌లో ఏ ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు

ఐపీఎల్‌.. ఏ సీజన్‌లో ఏ జట్టుకు చివరి స్థానం

సిక్సర్లే సిక్సర్లు... ఏ ఏడాది ఎన్ని కొట్టారంటే?

Eenadu.net Home