ప్రపంచ దృష్టి దినోత్సవం.. అక్టోబర్‌ 12

జ్ఞానేంద్రియానం నయనం ప్రదానం అంటారు. అందుకే, కళ్ల ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబర్‌ 12న ప్రపంచ దృష్టి దినోత్సవం నిర్వహిస్తుంటారు.

ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం థీమ్‌.. ‘విధుల్లోనూ మీ కళ్లను ప్రేమించండి’. ఏ పనిలో ఉన్నా కళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలనేది థీమ్‌ ఉద్దేశం. మరి ఆరోగ్యకరమైన కళ్ల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..

కంప్యూటర్‌ తెర నుంచి వచ్చే వెలుతురు, గదిలో వెలుతురు కళ్లపై ప్రభావం చూపుతాయి. అందుకే, కళ్లకు శ్రమ కలగని విధంగా కంప్యూటర్‌ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను, గదిలో వెలుగును అడ్జెస్ట్‌ చేసుకోవాలి.

కళ్లు, మానిటర్ ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్‌పై దుమ్మూధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల కళ్లు ఒత్తిడికి గురికావు.

రెప్పార్పకుండా ఎక్కువ సేపు కంప్యూటర్‌ను చూస్తూ ఉంటే కళ్లు పొడిబారిపోతాయి. అలా కాకూడదంటే ప్రతి 20 నిమిషాలకోసారి స్క్రీన్‌ దృష్టి మరల్చి.. మరో వస్తువుని 20 సెకండ్లపాటు చూడాలి. 

కళ్లకు ఇబ్బంది లేకుండా పనిచేయడానికి యాంటీ రిఫ్లెక్టివ్ కళ్లద్దాలను ఉపయోగించవచ్చు. ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి.  

కంప్యూటర్‌ ముందు, దుమ్మూధూళి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారు కాంటాక్ట్‌ లెన్స్‌ వాడకపోవడం ఉత్తమం. లేదంటే కళ్లు పొడిబారడం, మంట.. దురదగా అనిపించడం, ఇన్ఫెక్షన్‌ సోకడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. 

రసాయనాలు, ఇతర హానికర ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ప్రయోగశాలల్లో పనిచేసే వారు కళ్లకు రక్షణనిచ్చే అద్దాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. 

ఎండలో బయటకి వెళ్తున్నప్పుడు యూవీ కిరణాలు కళ్లపై పడతాయి. దీని వల్ల దృష్టిలోపం వచ్చే అవకాశముంది. కాబట్టి.. కళ్లకు రక్షణగా సన్‌ గ్లాసెస్‌ పెట్టుకోవడం మంచిది.

కళ్లు అలసిపోయినట్టుగా అనిపిస్తే చల్లటి పచ్చిపాలలో ముంచితీసిన దూది ఉండలు గానీ వాడి పడేసిన టీ పొడి బ్యాగులను ఫ్రిజ్‌లో కాపేపు ఉంచి వాటిని కళ్లపై పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. 

కళ్ల ఆరోగ్యానికి బీటా కెరోటిన్‌ అధికంగా ఉండే క్యారెట్స్‌, చిలగడదుంప, ఆకుకూరలు, లైకోపీన్‌ ఎక్కువగా లభించే టొమాటో, జామ పండ్లు, ద్రాక్ష పండ్లు.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

కళ్లు పొడిబారకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఇందుకోసం రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలి. 

ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలి. దృష్టిలోపం ఉన్నట్లు తేలితే అది మరింత పెరగకుండా చికిత్స, జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది.

వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడే అంశాలివే..!

సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

Eenadu.net Home