హ్యాట్రిక్స్.. భారీ మెజార్టీ.. 100% స్ట్రైక్‌రేట్
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమినే గెలిపించారు. కూటమి 164 స్థానాల్లో విజయం సాధించగా.. వైకాపా కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికరమైన రికార్డులు.. విశేషాలు ఇవీ..!
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 8 జిల్లాల్లో వైకాపాను క్లీన్‌స్వీప్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ 21 సీట్లు సాధించగా.. వైకాపా 4 చోట్లే గెలిచింది. పోటీ చేసిన అన్నీ స్థానాల్లో(21 అసెంబ్లీ, 2 ఎంపీ) జనసేన విజయపతాకం ఎగురవేసింది.
మొత్తంగా 81 మంది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు అభ్యర్థులు గెలిచారు. అలాగే, ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లు కూడా కూటమి తరఫున ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైకాపా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఆ పార్టీలో పేరున్న నేతలు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
మాజీ సీఎంల వారసులు ఎనిమిది మంది ఎన్నికల బరిలోకి దిగారు. వారిలో నారా లోకేశ్, బాలకృష్ణ, పురందేశ్వరి, వైఎస్.జగన్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ గెలుపొందారు. వైఎస్ షర్మిల, నేదురుమల్లి రామ్‌కుమార్ ఓడిపోయారు.
ఏపీలో ముగ్గురు తెదేపా నేతలకు 90వేలకుపైగా మెజార్టీ వచ్చింది.. గాజువాక పల్లా శ్రీనివాస్ 95,235.. భీమిలిలో గంటా శ్రీనివాస్ 92,401.. మంగళగిరిలో నారా లోకేశ్ 91,413 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన తెదేపా అభ్యర్థి శ్రీభరత్ అత్యధికంగా 5,04,247 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ (3,49,165) రెండో స్థానంలో ఉన్నారు.
మంగళగిరిలో దాదాపు 39 ఏళ్లుగా తెదేపా ప్రాతినిథ్యం లేదు. తాజాగా అక్కడ నారా లోకేశ్ గెలుపొంది చరిత్ర సృష్టించారు. చివరగా అక్కడ 1985లో తెదేపా తరఫున కోటేశ్వరరావు గెలిచారు.
అచ్చెన్నాయుడు(టెక్కలి), బాలకృష్ణ(హిందూపురం), బుచ్చయ్య చౌదరి(రాజమండ్రి రూరల్), బెందాళం అశోక్(ఇచ్ఛాపురం), చిన్నరాజప్ప(పెద్దాపురం), గొట్టిపాటి రవి(అద్దంకి), ఏలూరు సాంబశివరావు(పర్చూరు), రామ్మోహన్(విజయవాడ తూర్పు), నిమ్మల రామానాయుడు(పాలకొల్లు) హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు.