ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ గురించి మీకివి తెలుసా? 

భారత రక్షణ రంగంలో ప్రస్తుతం వైమానిక దళం శక్తిమంతంగా మారుతోంది. యుద్ధాల్లోనే కాదు.. సహాయక చర్యల్లోనూ వైమానిక దళం పాల్గొంటూ దేశానికి సేవ చేస్తోంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ డే (అక్టోబర్‌ 8) సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు.

భారత వైమానిక దళాన్ని అక్టోబర్‌ 8, 1932న స్థాపించారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్‌ ఫోర్స్‌ భారత్‌దే. 

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను 1945 - 1950 మధ్య ‘రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌’గా పిలిచేవారు. ఆ తర్వాత ‘రాయల్‌’ను తొలగించారు. 

రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కి తొలి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తొలి చీఫ్‌ ఆఫ్‌ ది ఎయిర్‌ స్టాఫ్‌గా సర్‌ థామస్‌ ఎల్మర్ట్స్‌ వ్యవహరించారు. ఆయన బ్రిటన్‌కు చెందిన వ్యక్తి.

ఇప్పటి వరకు పాకిస్థాన్‌తో జరిగిన నాలుగు యుద్ధాల్లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కీలక పాత్ర పోషించింది. 

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నినాదమేంటో తెలుసా? ‘నభ స్పృషమ్‌ దీప్తం (కీర్తితో ఆకాశాన్ని తాకాలి)’. దీన్ని భగవద్గీత నుంచి సంగ్రహించారు. 

దేశంలో ఐఏఎఫ్‌కు 60కిపైగా ఎయిర్‌ బేస్‌లున్నాయి. భారత్‌కు చెందిన ఏకైక విదేశీ బేస్‌.. తజికిస్థాన్‌లోని ఫర్‌ఖోర్‌లో ఉంది. అక్కడి ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి బేస్‌ కార్యకలాపాలు సాగిస్తోంది.

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఇప్పటి వరకు ఒక్కరికే పరమ వీర చక్ర గౌరవం దక్కింది. 1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో నిర్మల్‌ జిత్‌ సింగ్‌ చూపిన ధైర్యసాహసాలకు ఈ అవార్డు ప్రకటించారు.

ఐక్యరాజ్య సమితి నిర్వహించే శాంతి పరిరక్షక దళానికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ ఐఏఎఫ్‌ భాగం అవుతూ ఉంటుంది.

యుద్ధాలు, విపత్తులు ఎదురైనప్పుడు ఎయిర్‌ఫోర్స్‌ అనేక రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించింది. ఉత్తరాఖండ్‌ వరదల సమయంలో 20వేల మందిని ఎయిర్‌లిఫ్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. 

మనకూ ఉందొక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌!

ఖరీదైన నగరాలివే..!

బ్రెజిల్‌లో గాల్లోనే తినేయొచ్చు!

Eenadu.net Home