ఐర్లాండ్‌ గురించి మీకివి తెలుసా..?

ఐర్లాండ్‌, భారత్‌ మధ్య ఆగస్టు 18 నుంచి మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుంది. ఈ క్రమంలో ఆతిథ్య దేశం ఐర్లాండ్‌కు సంబంధించిన వింతలు.. విశేషాల గురించి తెలుసుకుందామా..

(photos:pixabay)

ఐర్లాండ్‌కి మొదటి బలం అక్కడి భూభాగం. సముద్ర తీరంలో ఎత్తయిన కొండలు, పచ్చటి ప్రకృతి సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. అందుకే ఈ దేశాన్ని ‘ఎమరాల్డ్‌ ఐల్‌’ అని పిలుస్తారు. 

హర్లింగ్‌ (హాకీలాగే ఉంటుంది. కానీ, బంతిని చేతితో పట్టుకొని స్టిక్‌తో కొట్టాలి), గేలిక్‌ ఫుట్‌బాల్‌, గేలిక్‌ హ్యాండ్‌బాల్‌ ఈ దేశ జాతీయ క్రీడలు. క్రికెట్‌కి కూడా ప్రాధాన్యమిస్తారు.

ప్రస్తుతం ప్రపంచమంతా జరుపుకొంటున్న ‘హాలోవీన్‌’.. ఐర్లాండ్‌లోనే మొదలైంది. 2 వేల సంవత్సరాల కిందట ‘సంహేన్‌’ అనే పండగలో భాగంగా విభిన్న వేషధారణలతో వేడుకలు చేసుకునేవారు. అదే క్రమంగా ప్రపంచమంతటా విస్తరించింది.

ఐర్లాండ్‌ వాతావరణంలో పాములు జీవించలేవు. అందుకే, ఇక్కడ ఒక్క పాము కూడా కనిపించదు. అయితే, వాటికి అనువైన వాతావరణం కల్పిస్తూ పెంచుకోవాలనుకుంటే అందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. 

ఏడో శతాబ్దంలో ఆహారం భద్రపర్చడానికి, శత్రువులు దాడి చేసినప్పుడు తలదాచుకోవడానికి ఐర్లాండ్‌ వ్యాప్తంగా వృత్తాకారంలో కోటలు నిర్మించారు. ఇప్పటికీ ఈ దేశంలో 40 వేలకు పైగా వృత్తాకార కోటలు, రాజులు నివసించిన కోటలు చూడొచ్చు. 

ఐర్లాండ్‌ జాతీయ చిహ్నం ఐరీష్‌ హెర్ప్‌ అనే సంగీత వాయిద్యం. ప్రపంచంలో ఒక సంగీత వాయిద్యం జాతీయ చిహ్నంగా ఉన్న దేశం ఐర్లాండ్‌ మాత్రమే.

ఈ దేశంలో వాతావరణం ఏ కాలంలోనైనా సాధారణంగానే ఉంటుంది. ఎండ, వర్షం, చలి ఎప్పుడూ తీవ్రంగా ఉండవు. చలికాలంలో 39 నుంచి 45 ఫారెన్‌ డిగ్రీలు, వేసవిలో 54 నుంచి 60 ఫారెన్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. 

ఇక్కడ ప్రజల్లో ఎవరైనా వందో పుట్టినరోజు జరుపుకొంటే.. ప్రభుత్వం బహుమతి ఇస్తోంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశాధ్యక్షుడి పేరుతో ఒక ఉత్తరం.. 2,540 యూరోల నగదు బహుమతి పంపుతోంది. 

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక సినీ అవార్డు.. ఆస్కార్‌. దీని ఐకాన్‌ను డిజైన్‌ చేసింది.. ఐర్లాండ్‌ దేశస్థుడే. హాలీవుడ్‌లో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కెడ్రిక్‌ గిబ్బన్స్‌ 1928లో ఆస్కార్‌ ఐకాన్‌ డిజైన్‌ చేశారు. ఈయన 39 సార్లు ఆస్కార్‌కు నామినేటై.. 11 సార్లు అవార్డు అందుకున్నారు.

ఐర్లాండ్‌లో 1608లో ఒక హోటల్‌ని స్థాపించారు. దాని పేరు వుడెన్‌బ్రిడ్జ్‌. అది గత 400 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. దాని నిర్వాహకులు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ విజయవంతంగా నడిపిస్తున్నారు.

ఐర్లాండ్‌లో ఏటా ‘పక్‌ ఫెయిర్‌’ వేడుక జరుగుతుంది. ఇందులో భాగంగా అడవుల్లో ఉండే ఒక మగ మేకను తీసుకొస్తారు. దానికి కిరీటం పెట్టి మూడు రోజులపాటు దాన్నే రాజుగా భావిస్తారు. ఆ తర్వాత తిరిగి అడవిలో వదిలేస్తారు. 

ప్రేమతత్వం గురించి చెబుతున్న సద్గురు

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

Eenadu.net Home