కోహ్లీ ముద్దు పేరు తెలుసా?
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు (నవంబర్ 5). ఈ సందర్భంగా కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బౌలర్‌గా మారి మూడు బంతులు వేసి ఆకట్టుకున్నాడు. 2015 ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు.
బౌలర్‌గానే కాదు.. వికెట్ కీపర్ అవతారమూ ఎత్తాడు కోహ్లీ. 2014లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో ఎం.ఎస్.ధోని బౌలింగ్ చేయగా.. కోహ్లీ వికెట్ కీపింగ్ చేశాడు. 2015 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ కొంతసేపు వికెట్ కీపర్‌గా ఉన్నాడు.
విరాట్ కోహ్లీ క్రికెటర్‌గా ఎదగడానికి సచిన్ తెందూల్కరే స్ఫూర్తి. 2011 ప్రపంచకప్‌లో ఆయన్ను భుజాన ఎత్తుకోవడం మర్చిపోలేని జ్ఞాపకమని కోహ్లీ ఓ సందర్భంలో చెప్పాడు.
కోహ్లీకి ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. అందుకే, గోవా ఫుట్‌బాల్ క్లబ్ యాజమాన్యంలో భాగమయ్యాడు. ఈ జట్టులో అతడికి 12 శాతం వాటా ఉంది.
ప్రస్తుతం కోహ్లీ వీగన్‌గా మారిపోయాడు. ఇది వరకు మాంసాహారం, ఫాస్ట్‌ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తినేవాడట. శరీరాన్ని, క్రికెట్‌లో తన ప్రదర్శనను మెరుగుపర్చుకునే క్రమంలో వాటిని తినడం మానేశాడు.
ఐపీఎల్ ప్రారంభించిన నుంచి ఇప్పటి కోహ్లీ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోనే ఉన్నాడు.
కోహ్లీని ముద్దుగా అందరూ చీకూ అని పిలుస్తుంటారు. ఆ ముద్దుపేరును అతడికి రంజీ ట్రోఫీ సమయంలో స్టేట్ కోచ్ పెట్టారట. అది ‘చంపక్’ అనే కార్టూన్ పుస్తకంలోని కుందేలు పాత్ర.
విరాట్ కోహ్లీ శరీరంపై టాటూలను గమనించే ఉంటారు కదా..! శివుడి రూపం, తల్లిదండ్రుల పేర్లు, తన క్రికెట్ కెరీర్‌లో గుర్తుండిపోయే మైలురాళ్లు ఇలా మొత్తం 12 టాటూలు వేయించుకున్నాడు.
ఆసియాలోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ (261 మిలియన్) ఉన్న సెలబ్రిటీ విరాట్ కోహ్లీనే. బ్రాండ్స్ ప్రచారం కోసం ఒక్కో పోస్టుకు రూ. 14 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.
కోహ్లీ తన కెరీర్‌లో నవంబర్ 4 వరకు అన్ని ఫార్మాట్లు కలిపి 514 మ్యాచ్‌లు ఆడి.. 26,209 పరుగులు చేశాడు. అందులో 78 శతకాలు, 136 అర్ధ శతకాలున్నాయి. ఉత్తమ స్కోర్ 254*.