దీర్ఘాయుష్షుకు జపాన్‌ ఇకిగై సూత్రాలు

ఈ ఆధునిక జీవనశైలి, అలవాట్లతో మనిషి ఆయుష్షు క్రమంగా తగ్గుతోంది. జపాన్‌లో మాత్రం చాలా మంది నూరేళ్లు దాటి జీవిస్తున్నారు. అదెలా సాధ్యమంటారా? వాళ్లు‘ఇకిగై’ సూత్రాలను పాటిస్తారు మరి. 

(Photos:Pixels)

‘ఇకిగై’ అనేది జపనీయులు ఆచరించే జీవన విధానం. మనిషి సంతోషంగా దీర్ఘకాలం జీవించడానికి ఏం చేయాలో ఇకిగై సూత్రాలు వివరిస్తాయి. అవేంటంటే..

1. విశ్రాంతి తీసుకోవద్దు

వయసు 60 దాటగానే ఉద్యోగం నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకొని విశ్రాంతి తీసుకుంటారు. కానీ, అలా అస్సలు చేయొద్దు. ఎంత వయసు మీదపడ్డా ఉత్సాహంగా ఉంటూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి.

2. ఉరుకులు.. పరుగులొద్దు

ఆఫీసుకు ఆలస్యమవుతుందని, ఇతరులకంటే ముందుండాలని పరుగులు పెట్టొద్దు. సమయం తీసుకొని పనుల్ని నింపాదిగా చేసుకోవాలి. అప్పుడే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించొచ్చు. 

3. పొట్ట నింపొద్దు

ఆకలిగా ఉందని కడుపు నిండా తింటే.. బరువు పెరగడమే కాకుండా ఆరోగ్య సమస్యలొస్తాయి. అందుకే, ఏం తిన్నా కొంచమే తినాలి. కడుపులో ఎప్పుడూ కొంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. 

4. స్నేహితులే సగం బలం

మీ చుట్టూ మంచి స్నేహితులుండేలా చూసుకోవాలి. వారితో సమయం గడిపితే మనసుకు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యమూ బాగుంటుంది. దీంతో ఆయుష్షు పెరుగుతుంది. 

5. వ్యాయామం తప్పనిసరి

ప్రతి రోజు కొన్ని నిమిషాలపాటైనా వ్యాయామం చేయాలి. దీర్ఘాయుష్షుకు ఇది ముఖ్యమైన సూత్రం. వ్యాయామం చేస్తే శరీరం ఉత్తేజంగా, ఆరోగ్యంగా ఉంటుంది. 

6. నవ్వు

ఎవరు ఎదురొచ్చినా ‘రేలంగి మావయ్య’లా చిరునవ్వుతో పలకరించాలి. ప్రతి దానికి బాధపడకుండా నవ్వుతూ నవ్విస్తూ ఉంటే నూరేళ్లు ఆరోగ్యంగా ఉండొచ్చు. 

7. ప్రకృతితో మమేకం

కాంక్రీట్‌ జంగిల్‌లో ఉండే ప్రజలు అప్పుడప్పుడు ప్రకృతిలో కొంత సమయం గడపాలి. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి. సమయం వృథా అనిపించినా.. అది మానసికస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. 

8. కృతజ్ఞతతో ఉండాలి

ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలి. మీకుతోడుగా ఉన్నవారిని, మీకు ప్రోత్సాహం అందించిన వారిని ఎన్నటికీ మర్చిపోవద్దు. వీలుకుదిరినప్పుడు మీకు వారెంత ప్రత్యేకమో చెబుతుండాలి.

9. ప్రస్తుతంలో ఉండండి

గతం గురించి చింతించొద్దు.. భవిష్యత్తు గురించి భయపడొద్దు. ప్రస్తుత సమయమే మీ చేతుల్లో ఉంది. దాన్ని మంచికి ఉపయోగించండి. ఎప్పటికీ గుర్తుండిపోయేలా కాలాన్ని అనుభవించాలి. 

10. నచ్చిందే చేయండి

మీకేది నచ్చుతుందో దాన్ని గుర్తించండి. దాన్నే ఫాలోఅవండి. నచ్చింది చేస్తున్నప్పుడే సంతోషంగా ఉండగలరు. జీవితానికి ఒక అర్థముంటుంది. 

సౌతాఫ్రికా గురించి ఆసక్తికర విషయాలు

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో టాప్‌- 10 ఫ్రెష్‌ ఎయిర్‌ ప్రాంతాలివే

ఏంజెలియా క్యాట్‌ వాక్‌.. నెట్టింట వైరల్‌ టాక్‌!

Eenadu.net Home