దండాలయ్యా.. ఉండ్రాళ్ళయ్యా..!
బొజ్జ గణపతిని ప్రసన్నం చేసుకోవాలంటే.. ఆయనకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టాల్సిందే..! అసలు వినాయకుడికి నైవేద్యంగా ఏలాంటి పిండి వంటలు పెడతారో.. ఆయనకి ఏమిష్టమో ఓ సారి చూసేయండి.
కుడుములు, ఉండ్రాళ్లు..
తడి బియ్యం పిండిలో బెల్లం కలిపి అప్పాలుగా చేసి ఆవిరి మీద ఉడికిస్తారు. ఈ పిండినే గుండ్రంగా చేస్తే ఉండ్రాళ్లు అంటారు. ఇవంటే గణేశుడికి మహా ప్రీతి.
మోదక్..
మహారాష్ట్రలో ఫేమస్ ఈ వంటకం. దీంట్లో కొబ్బరి, బెల్లంతో చేసిన పదార్థాన్ని పెట్టి.. ఆవిరి మీద ఉడికిస్తారు. ఇవి గణపతికి చాలా ఇష్టం అని అక్కడి ప్రజల నమ్మకం.
రవ్వలడ్డు..
తెలుగు రాష్ట్రాల్లో రవ్వలడ్డు తెలియని వారుండరు. బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి, కొబ్బరి తురుము వేసి చేసే ఈ లడ్డూలు బుజ్జి గణపయ్యకి ఫెవరెట్.
భక్ష్యాలు..
భక్ష్యాలు అంటే తెలుసా.. అదేనండీ..! బొబ్బట్లు.. చపాతీ పిండి ముద్దలో శనగపప్పు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని పెడతారు. దాన్ని నెయ్యితో పెనం మీద కాలుస్తారు.
మరమరాల ఉండలు..
వీటితో బెల్లాన్ని కలిపి ఉండలు చుడతారు. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఇవి అంటే గణేష్‌కి మహా ప్రీతి.
పాల తాలికలు..
తడి బియ్యం పిండిని దాల్చి, పాలు, బెల్లం కలిపి చేస్తారు. దీన్ని గణపతి ఎంతో ఇష్టంగా ఆరగిస్తాడని ప్రజల నమ్మకం.
మోతీచూర్ లడ్డు..
శనగపిండి, పంచదార, నెయ్యి కలిపి చేస్తారు. వీటి రుచి అమోఘం, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇవి మహారాష్ట్రలో గణపతికి నైవేద్యంగా పెడతారు.
పాయసం, పులిహోర..
ప్రతి పండగకీ ఇవి చేసేవే అంటారా... కానీ ఇవి అంటే గణపయ్యకి భలే ఇష్టమట. పూజలో ఎన్ని పిండి వంటలు ఉన్నా తప్పనిసరిగా పాయసం, పులిహోర ఉండాల్సిందే.
శనగలు..
వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టి తాలింపు వేస్తారు. వీటినే గుగ్గిళ్లు అంటారు. తొండపు గణేశుడికి చాలా ఇష్టం..