రామోజీరావు జీవితంలో మైలురాళ్లు..!
చెరుకూరి రామోజీరావు.. అసలు పేరు రామయ్య. నవంబర్ 16, 1936న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. బీఎస్సీ పూర్తి చేసి దిల్లీలోని ఓ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. అమెరికాలో ఉద్యోగం వచ్చినా వదులుకున్నారు.
రామోజీరావు ఆగస్టు 19, 1961న రమాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె అసలు పేరు రమణమ్మ. ఇద్దరూ స్కూల్‌లో చేరినప్పుడే పేర్లు మార్చుకోవడం గమనార్హం.
దిల్లీ నుంచి 1962లో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. మార్గదర్శి, కిరణ్ యాడ్స్, ఇమెజెస్ యాడ్స్, వసుంధర ఫెర్టిలైజర్స్ తదితర సంస్థలను నెలకొల్పారు. 1969లో అన్నదాత మ్యాగజైన్ ప్రారంభించి.. ఎరువుల వ్యాపారం ఆపేశారు.
విశాఖపట్నంలో జూన్ 21,1980న త్రీస్టార్ హోటల్‌గా డాల్ఫిన్ హోటల్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలోని తార, సితార, శాంతినికేతన్, సహారా డాల్ఫిన్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి.
ఆగస్టు 10,1974న విశాఖలో ‘ఈనాడు’ పత్రికను ప్రారంభించారు. 1975 డిసెంబర్ 17న హైదరాబాద్ ఎడిషన్ మొదలైంది. 1988 ఫిబ్రవరి 28న సండే మ్యాగజైన్‌ను, 1989 జనవరి 26న జిల్లా ఎడిషన్‌ను తీసుకొచ్చారు.
1976లో సినీ విశేషాల ‘సితార’ను, 1978లో నవలలు.. కథలతో ‘చతుర’, ‘విపుల’ మాసపత్రికలను ప్రారంభించారు. 1984 జనవరి 26న ‘న్యూస్‌టైమ్’ పేరుతో ఆంగ్ల దినపత్రికను తీసుకొచ్చారు. ఈ పత్రిక ఇరవై ఏళ్లపాటు నడిచింది.
తెలుగు వారి రుచుల్ని ప్రపంచానికి చాటుతున్న ‘ప్రియా ఫుడ్స్’ను 1980 ఫిబ్రవరి 9న ప్రారంభించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 50 వారాలపాటు ఆలిండియా రేడియోలో నాటికలు ప్రసారం చేయడం విశేషం.
స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు 1978లో వచ్చిన ‘మార్పు’లో న్యాయమూర్తిగా అతిథి పాత్రలో కనిపించారు. ప్రచారంలో భాగంగా చిత్రబృందం పోస్టర్‌పై ఆయన ఫొటో ప్రచురించింది.
వినోదాత్మక, సందేశాత్మక చిత్రాలు అందించాలన్న సంకల్పంతో మార్చి 2,1983న ‘ఉషా కిరణ్ మూవీస్’ సంస్థను ఏర్పాటు చేశారు. తొలి సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ’తో ‘మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్’నీ ప్రారంభించారు.
తెలుగులోనే కాదు.. హిందీ, ప్రాంతీయ భాషల్లోనూ సినిమాలు నిర్మించారు. ‘ప్రతిఘాత్’, ‘పో ఒండ్రు పుయలందు’, ‘కరువంద నేరము’, ‘కంచాన్ గంగ’, ‘నినగాగి’ వంటివి కొన్ని..
పాత్రికేయులకు శిక్షణ విషయంలో వ్యవస్థీకృత రూపం ఇచ్చేందుకు 1990లో ఈనాడు జర్నలిజం స్కూలును ప్రారంభించారు. ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేశారు.
హృదయాలను హత్తుకునే హస్తకళలు, చేతివృత్తి కళాకారుల్ని ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌లో నవంబర్ 16, 1992న ‘కళాంజలి’ షోరూమ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత విజయవాడ, తిరుపతి, విశాఖపట్నానికి విస్తరించారు.
నవంబర్ 16,1996న రామోజీరావు షష్టిపూర్తి సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీని ప్రారంభించారు. బిగ్గెస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ సెంటర్‌గా ఆర్‌ఎఫ్‌సీ గిన్నిస్ రికార్డులోకెక్కింది. ఎన్నో సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు.. చిత్రీకరిస్తున్నారు.
ఈటీవీ.. మీ టీవీ అంటూ 1995లో బుల్లితెర ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతర్జాలం వేదికగా వార్తలందించేందుకు 1999లో ‘www.eenadu.net’ వెబ్‌సైట్ తీసుకొచ్చారు.
సతీమణి రమాదేవీ పేరు మీద రామోజీ ఫిల్మ్‌సిటీకి సమీపంలో జూన్ 20, 2002న రమాదేవి పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు
తెలుగు పాఠకులకు వరంగా ‘ఈనాడు’లో ఇంద్రధనస్సు వంటి ఏడు ప్రత్యేక పేజీల(చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయ్‌బుజ్జీ)ను 2002లో జులై తొలివారంలో ప్రవేశపెట్టారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో ‘ఈనాడు’ దిల్లీ ఎడిషన్‌ను ప్రారంభించారు.
ప్రజలకు వార్తలను అందించేందుకు డిసెంబర్ 28, 2003న ‘ఈటీవీ-2’ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. జులై 12, 2007న అంతర్జాలంలో ఈనాడు ఈ-పేపర్ మొదలైంది. ఏప్రిల్ 14, 2008న ‘ఈనాడు ముందడుగు’ విభాగం ఏర్పాటు చేసి ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు.
ఇవేకాకుండా రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్, ఈటీవీ భారత్, టీవీలోనే మరో 4 ఛానళ్లు, ఈ-ఎఫ్‌ఎం ప్రారంభించారు. రామోజీ ఫౌండేషన్ పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
2016లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. 1994లో కెప్టెన్ దుర్గాప్రసాద్, 2001లో బి.డి. గోయంకా, యుధ్‌వీర్ అవార్డులు వచ్చాయి. 1989లో ఎస్‌వీయూ నుంచి డాక్టరేట్, ఆంధ్ర విశ్వకళాపరిషత్ డి.లిట్ అందుకున్నారు.