వర్షాకాలంలో ఇవి తప్పక చూడాల్సిందే..
వర్షంలో తడుస్తూ కొండలు, నదులు, కొలనులు చూస్తూ ప్రకృతిని ఆస్వాదించడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. భారత్‌లో అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. వర్షాకాలంలో ఒక్కసారైనా చూడదగ్గ ప్రదేశాల్లో ఇవి కొన్ని..
లొనవాలా- మహారాష్ట్ర
సహ్యాద్రి కొండలు నైరుతి రుతుపవనాల రాకతో పచ్చరంగు పులుముకున్నట్లు అందంగా ఉంటాయి. వర్షాలతో లొనవాలా ఘాట్లు ఆహ్లాదకరంగా ఉంటాయి. ముంబయి మహానగరానికి కాస్త దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో జలపాతాలతో ఈ ప్రాంతం చాలా బాగుంటుంది.
గోవా...
వర్షాకాలంలో చూడదగ్గ ప్రాంతాల్లో ఒకటి గోవా. ఇక్కడ ఏ కాలమైనా వాతావరణం బాగుంటుంది. వానాకాలంలో మాత్రం బీచ్‌లో దృశ్యాలు మరింత అద్భుతంగా ఉంటాయి. వర్షంలో ఆటలాడుతూ.. అక్కడ దొరికే ప్రత్యేక ఆహారం రుచిచూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.
కొడైకెనాల్- తమిళనాడు
పశ్చిమ ఘాట్‌లోని పళని కొండ ప్రాంతాన్ని ‘ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్’గా పిలుస్తారు. ఇక్కడ ఉండే జలపాతాలు, సరస్సులు పర్యాటకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. ప్రకృతి రమణీయంగా స్వాగతం చెప్తుంది. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది.
కూర్గ్- కర్ణాటక
ఇది దట్టమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాంతం అనేక రకాల చెట్లు, జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. సరస్సులు, కాఫీ తోటలతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
మున్నార్- కేరళ
దక్షిణ భారతదేశంలో వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన మరో ప్రదేశం మున్నార్. ఈ ప్రాంతమంతా.. తోటలు, కొబ్బరి చెట్లతో నిండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
లద్దాఖ్.. జమ్మూకశ్మీర్
ఎడాది పొడవునా ఎంతో మంది లద్దాఖ్ పర్యటనకు వెళ్తుంటారు. కానీ, వర్షకాలంలో సెప్టెంబరు 17 నుంచి 27 వరకూ అక్కడి సంస్కృతి ఉట్టిపడేలా జరిగే జాతర ఆకట్టుకుంటుంది.
ఉదయ్‌పుర్- రాజస్థాన్..
ఒకప్పుడు రాజులు నివసించిన ప్రాంతం కావడంతో.. ఎక్కడ చూసినా రాజసం ఉట్టిపడుతుంది. వీధులు, భవనాలు, చాలా అందంగా ఉంటాయి. అదీ కాక వర్షాకాలం అయితే సరస్సులు, వాటి పక్కన కొండలు పచ్చరంగు పులుముకున్నట్లు ఆహ్లాదంగా ఉంటాయి.
షిల్లాంగ్- మేఘాలయ..
షిల్లాంగ్‌లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదవుతుంది. జయంతి కొండలు, అందమైన జలపాతాలు కనువిందు చేస్తాయి. ట్రెక్కింగ్, బోటింగ్ వంటివి చేయొచ్చు.
పుదుచ్చేరి..
పూర్వ కాలంలో నిర్మించిన భవనాలు, విల్లాలే ఇక్కడ ఇంకా కొనసాగుతున్నాయి. బీచ్‌లో ఉండే కేఫ్‌లు, బార్‌లు ఎప్పుడూ పర్యటకులతో సందడిగా ఉంటాయి. సాయంత్రం వేళల్లో మేఘాలు కమ్ముకున్న ఆకాశాన్ని చూస్తూ బీచ్‌లో నడక సాగిస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
పుష్కర్- రాజస్థాన్..
తెల్లవారుజామునే దట్టమైన పొగమంచుతో, నెమళ్ల కూతలతో నిద్ర లేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. పర్యటకులు సూర్యోదయం అవ్వగానే ఒంటెలపై సవారీ చేస్తూ వీధుల్లో సందడి చేస్తుంటారు.
జోగ్- కర్ణాటక..
చుట్టూ అటవీ ప్రాంతం మధ్యలో వాటర్‌ఫాల్స్‌తో చాలా అందంగా ఉంటుంది. వర్షాకాలంలో చిరుజల్లులు, పొగమంచుతో ఈ జలపాతం అత్యద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి ప్రకృతిలో నడక, అడవిలో రకరకాల పక్షుల సందడి చాలా సరదాగా ఉంటుంది.
photos: unsplash