ఎత్తు నాలుగడుగులు.. నలుగురికీ స్ఫూర్తికాంతులు!

నల్సార్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి భవ్య జోహారి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 బంగారు పతకాలు సాధించి భళా అనిపించాడు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ పతకాలు అందుకొని స్ఫూర్తి కాంతుల్ని వెదజల్లుతోన్న ఈ 23 ఏళ్ల కుర్రాడి గురించి క్లుప్తంగా..!

ఎత్తు దాదాపు నాలుగడుగులు.. కానీ, బీఏ ఎల్‌ఎల్‌బీ (Hons)లో ఆరడుగుల బుల్లెట్‌లా దూసుకెళ్లాడు. తన అసాధారణ ప్రతిభతో 10 బంగారు పతకాలు అందుకొని అందరితో ఔరా అనిపించుకున్నాడు.

మనిషి లోపాన్ని ఎగతాళి చేసేవారే గానీ ప్రోత్సహించేవారు అరుదు! ఇలా తనకు అనేక అవమానాలు ఎదురైనా వాటిని అవకాశాలుగా భావించి దీక్షతో చదివి అద్భుతం సృష్టించాడు జైపుర్‌ (రాజస్థాన్‌)కు చెందిన భవ్య జోహారి.

లోపం శరీరానికే గానీ.. ప్రతిభకు కాదు. కృషి, పట్టుదల ఉంటే దేన్నయినా సాధించవచ్చని నిరూపించిన ఈ కుర్రాడు.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నల్సార్‌ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పతకాలు అందుకున్నాడు. 

క్రిమినల్‌ లా, హిస్టరీ, ఎన్విరాన్‌మెంటల్‌ లా తదితర సబ్జెక్టుల్లో అసాధారణ ప్రతిభతో నల్సార్‌ ఛాన్సలర్‌- తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాథే, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, తెలంగాణ గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో మెడల్స్‌ అందుకున్నాడు.

ఐదేళ్ల క్రితం నల్సార్‌లో చేరినప్పుడు.. భవ్య జోహారి పొట్టిగా ఉన్నాడని చాలామంది ఎగతాళి చేసేవారు. దీంతో కొన్నిరోజులు కష్టంగానే గడిచాయి. అవమానాన్ని లెక్కచేయకుండా లక్ష్య సాధన వైపు నడిచి మొదటి ఏడాది ఫలితాల్లో సత్తా చాటాడు. దీంతో అతడి ప్రతిభను చూసి అంతా ఆశ్చర్యపోయారు. 

తోటి విద్యార్థులంతా అతడిని ఉన్నత లక్ష్యాలు కలిగిన ఒక స్కాలర్‌గా చూడటం మొదలుపెట్టారు. తనకు సహకరించిన ఫ్రెండ్స్‌కు థాంక్స్‌ చెప్పిన ఈ స్ఫూర్తి కెరటం.. మంచి స్నేహితులు ఉంటే అన్నీ సాధ్యమే అంటున్నాడు.

క్రిమినల్‌ లా, మానవ హక్కుల సంబంధిత సబ్జెక్టులంటే అతడికి మక్కువ. భవ్య జోహారి తండ్రి చార్టెడ్‌ అకౌంటెంట్‌ కాగా.. తల్లి మ్యూచువల్‌ ఫండ్స్ అడ్వైజర్‌. 

‘‘నాకు పలు ఉన్నత సంస్థల్లో జాబ్‌ ఆఫర్‌లు వచ్చాయి. కానీ, ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నా. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ అడ్మిషన్‌ తీసుకున్నా’’ అని మీడియాకు వెల్లడించాడు. 

మహనీయుడు చెప్పిన మంచిమాటలు

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home