‘మిమీ’ నువ్వు సూపర్ సుమీ!
కెరీర్ ప్రారంభంలోనే సరోగేట్ మదర్‌గా నటించాలంటే కథానాయికలు భయపడతారు. కారణం ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తాయేమోనని.. కానీ, ఆ ధైర్యం చేసింది కాబట్టే కృతి సనన్ ఇప్పుడు జాతీయ ఉత్తమ నటిగా నిలిచింది. ఆ సినిమానే ‘మిమీ’.
దేశంలో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న సమయంలోనే ‘మిమీ’ మొదలైంది. థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు.
కరోనా అడ్డంకులు ఏవీ ‘మిమీ’ని వెనక్కి నెట్టలేదు. ఇప్పుడు ఆ ధైర్యమే అవార్డు తెచ్చిపెట్టి ఆ కష్టాన్ని మరచిపోయేలా చేసింది. ఈ సినిమాలో కృతి సనన్ నటనకే కాదు, కథకు కూడా ప్రశంసలు దక్కాయి.
‘‘లక్ష్మణ్ సర్ మీరు చెప్పినట్లుగానే ‘మిమీ’కి నేషనల్ అవార్డు వచ్చింది. మీ వల్లే ఇది సాధ్యమైంది’’ ... ఇది సినిమా దర్శకుణ్ని ఉద్దేశించి కృతి చేసిన పోస్ట్. ఈ మాటల్లో ఆనందం, నమ్మకం రెండూ కనిపిస్తున్నాయి.
‘కళ్లనిండా ఆనంద భాష్పాలు.. గుండె నిండా సంతోషం’ అంటూ సోషల్ మీడియాలో కృతి పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘మిమీ’ పాత్ర కోసం కృతి మూడు నెలల్లో 15 కిలోల బరువు పెరిగిందట. పిజ్జాలు, బర్గర్‌లు బాగా లాగించి.. బరువు పెరిగేసిందట. ఎంతగానో ఇష్టపడే యోగా, వర్కౌట్స్‌ని కూడా పక్కన పెట్టేసిందట.
This browser does not support the video element.
‘మిమీ’ అంటే ఇప్పుడు అవార్డు గుర్తొస్తుందేమో కానీ.. ఇన్నాళ్లుగా గుర్తొచ్చేది మాత్రం సినిమాలోని ‘పరమ్ పరమ్ పరమసుందరి..’ పాటనే. అంతలా ఈ పాట హిట్ అయ్యింది, వైరల్ అయ్యింది కూడా.
అన్నట్లు ఈ పాట కోసం కృతి మళ్లీ బరువు తగ్గిందట. పాటలో ఇలా కనిపిస్తే బాగుంటావు అని అనడంతో ఆలస్యం చేయకుండా డైట్, ఫిట్‌నెస్ రూల్స్ పెట్టుకుని నాజూగ్గా మారింది.
బరువు పెరగటం తేలిక, అదే బరువు తగ్గాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం నాకు ఆనందమే.. అంటుంది కృతి. ఇప్పుడు అదే కృషి పురస్కారం అయ్యింది అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
వంట చేయడమంటే కృతికి చాలా ఇష్టమట. ఖాళీ సమయం దొరికితే వంటింట్లోనే గడిపేస్తుందట. పెసరపప్పు హల్వా ఇస్తే ఓ పట్టుపట్టేస్తా అని నవ్వుతూ చెబుతుంది.
కథక్ డ్యాన్స్‌లో ఈమె శిక్షణ తీసుకుందట. టీనేజ్ నుంచే తనకి హృతిక్ రోషన్ అంటే ఇష్టమని చెబుతుంటుంది.
యాక్టింగ్ మీదున్న అభిమానంతో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్‌లో వచ్చిన రెండు ఉద్యోగాల్ని వదులుకుని దిల్లీ నుంచి ముంబయికి వచ్చింది. టాలీవుడ్‌లో తెలుగులో ‘1 నేనొక్కడినే’తో తెరంగేట్రం చేసింది.