పర్యావరణ హితం రంగుల హోలీ! 

మార్చి 25న హోలీ పండుగ. చిన్నా పెద్దా అంతా కలిసి వీధుల్లో రంగులతో సందడి చేస్తారు. ఆ రంగులు కూడా పర్యావరణ హితమైనవి అయితే ఇంకా మంచిది. పండ్లు, పూలు, ఇతర పదార్థాలతో ఇంట్లోనే సహజ రంగులు సిద్ధం చేసుకొని, హోలీ ఆడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవి ఎలా తయారు చేసుకోవాలంటే..

పసుపు రంగు

శనగపిండిని, పసుపుని 1:2 నిష్పత్తిలో తీసుకోవాలి. వాటిని అరచేతులతో బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని జల్లెడ పడితే ఎల్లో కలర్‌ రెడీ. బంతిపూలను నీటిలో మరిగించినా పసుపు రంగు నీరు తయారవుతుంది. పసుపును మాత్రమే నీళ్లలో కలిపినా సరిపోతుంది. 

ఎరుపు

పసుపులో నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని ఎండ తగలకుండా.. ఆరబెడితే సరి. మందారపూలను ఎండబెట్టి మిక్సీ పట్టి దాన్ని కుంకుమ, వరిపిండితో కలిపితే ఎరుపు రంగు వస్తుంది. దానిమ్మ తొక్కలను ఉడకబెడితే ఆ నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. వాటితోనూ హోలీ ఆడొచ్చు.

మెజెంటా

బీట్‌రూట్‌ను ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. అది చల్లారిన తరువాత ఓ పాత్రలోకి వడకట్టి ఆ నీళ్లతో హోలీ ఆడుకోవచ్చు. దీని వల్ల ఎటువంటి చర్మ సమస్యలూ రావు. 

పింక్‌

ఇదీ ఎరుపు రంగు తయారీలాగే.. పసుపు పొడిలో నిమ్మరసం చాలా తక్కువ కలపాలి. దాన్ని ఎండ తగలకుండా.. గాలి, వెలుతురు బాగా వచ్చే చోట ఆరబెట్టాలి. 

బ్రౌన్‌

కాఫీ పొడిని కాసేపు వేడి నీటిలో మరిగించాలి. అందులో కొంచెం రోజ్‌ వాటర్‌ కలిపితే వాసన రాదు. కానీ.. ఈ రంగు దుస్తులకు తగిలితే మరకలు పోవనే విషయం గుర్తుంచుకోండి.

పర్పుల్

కొన్ని బ్లాక్‌ క్యారెట్లు తీసుకొని మిక్సీ పట్టి మొక్కజొన్న పిండిలో కలపాలి. ఆ పొడిని ఎండబెట్టి, కాస్త రోజ్‌ వాటర్‌ కలిపితే వాసన రాదు. 

గ్రే

ఉసిరికాయ గింజలను పొడి కొట్టి ఎండబెట్టాలి. అందులో మొక్కజొన్న పిండి కలిపి గ్రే కలర్‌గా వాడుకోవచ్చు.

గ్రీన్‌ 

గోరింటాకు పొడిని బియ్యం పిండిలో కలిపితే సరిపోతుంది. మైదాతో కలిపినా ఇబ్బంది ఉండదు. అయితే ఈ మరకలు దుస్తులపై అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా మందార ఆకుల పొడిని కూడా వాడొచ్చు. 

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home