చిత్రం చెప్పేవిశేషాలు
(06-01-2025)
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న ముక్కోటి ఏకాదశి మహొత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు పరశురామావతారంలో దర్శనమిచ్చారు.
మిర్చి పంటలో తెగుళ్ల సమస్యతో రైతులు విలవిల్లాడుతున్నారు. నష్టపోయి పంటను పశువులకు మేతగా వదిలేస్తున్నారు.
ఒకచోట చెదలు పట్టడం మొదలైతే వస్తువు పిప్పి చేసేంత వరకు వదలదు. దీనికి భిన్నంగా ఓ చెట్టు మాత్రం జగమొండిలా పచ్చదానాన్ని పెంచుకుంటూ చెదపురుగులకు సవాల్ అన్నట్టుగా ఉంది.
గోదాదేవి సమేత శ్రీరంగనాథస్వామి దర్శన భాగ్యం భక్తజనానికి ఒక పులకింత. ఇందుకోసం వారు కొలువైన క్షేత్రాలకు వెళ్లి ఆరాధించి వస్తుంటారు. అలాంటిది బాలికలు వైష్ణవి వర్మ, జియా వర్మ వారి వేషధారణతో కనిపించడంతో భక్తులు తన్మయం చెందారు.
నిప్పులు కురిపించే భానుడు శీతాకాలంలో చల్లబడ్డాడు. సూర్యోదయం వేళ కమ్ముకున్న పొగమంచుతో చంద్రున్ని తలపిస్తూ దర్శనమిచ్చాడు.
కూత పెడితే పాటలా వచ్చే స్వరంతో మనస్సులను ఉత్తేజ పరుస్తూ... ఆకారంలో పిచ్చుకలా కనువిందు చేసే కొల్లేరు అందాల అతిథి సిట్రిన్ వాగ్‌టైల్. ఈ పక్షి అరిస్తే వచ్చే శబ్దం సంగీతంలా ఉండటంతో స్థానికులు దీనిని పాటల పసుపు పిట్ట అని పిలుచుకుంటారు.
అంతర్గాం-పాలకుర్తి మండలాల మధ్య కుక్కలగూడూరు శివారులో బండల వాగు వంతెనపై నుంచి ప్రకృతి అందాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి.
నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్‌కు ఆదివార సందర్శకులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది సందర్శించినట్లు సొసైటీ వర్గాలు తెలిపాయి. స్టాళ్లు సందర్శకులతో కిటకిటలాడాయి. ఆటపాటలతో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా గడిపారు.
మహాబలిపురంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చెంగల్పట్టు, మదురై, కోవై జిల్లాల్లో బెలూన్ల ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు.