చిత్రం చెప్పే విశేషాలు
(23-01-2025)
గౌతమీ గోదావరి నదీ తీరంలోని యానాం రాజీవ్ బీచ్ సరికొత్త అందాలతో సందర్శకులకు కనువిందు చేస్తోంది.
సహజ శిల్పి సాలీడు తీర్చిదిద్దిన గూటికి నీటి బిందువులు ఇలా ముత్యాల తోరణాలయ్యాయి. బుధవారం ఏలూరులో కనిపించిన మంచు బిందువుల సాలెగూడు చూపరులను పరవశులను చేసింది.
పాఠశాల రైల్వేస్టేషన్ అయింది. తరగతి గదులు బోగీలయ్యాయి. వరండా ప్లాట్‌ఫాం అయింది. ప్రయాణికులుగా విద్యార్థులు రావడమే ఆలస్యం. ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉన్న చిత్రం ఇల్లంతకుంట మండలం కందికట్కూరులోనిది.
నేతాజీపై అభిమానంతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పత్రచిత్రకారుడు గుండు శివకుమార్ బాదం ఆకుపై సుభాష్‌చంద్రబోస్ చిత్రాన్ని మలిచారు. నేడు (జనవరి 23) ఆయన జయంతి.
మంగళపాలెం గ్రామదేవత మరిడితల్లి తీర్థ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని 2,000 డజన్ల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ సమీపంలో మంచుతో పేరుకుపోయి శ్వేతవర్ణంలోకి మారిన అటవీ ప్రాంతం.
చరిత్రాత్మక ఖిల్లా దుర్గంలో కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఖిల్లా పార్క్ రాత్రివేళ విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది.
నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని రోళ్లపాడు అభయారణ్యంలో ఉన్న గడ్డి మైదానాల్లో కృష్ణజింకల పోరు కనువిందు చేసింది. తగ్గేదేలే అన్నట్టు పరస్పరం పోట్లాటకు దిగాయి.
ఈ చిత్రాన్ని చూస్తే.. రోడ్డు పక్కన విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న బాతు బొమ్మల మాదిరిగా కన్పిస్తున్నాయి కదూ? కానీ, అది నిజం కాదు. కొత్తగూడెం-ఖమ్మం, వేపలగడ్డ వద్ద ప్రధాన రహదారిని దాటేందుకు ప్రయత్నిస్తున్న బాతుల మంద ఇది.
సిద్దిపేట సుభాష్‌రోడ్డులో ప్రత్యేకంగా వేదికపై సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేషధారణలతో అలరించారు.