చిత్రం చెప్పే విశేషాలు

(11-07-2024)

మెదక్‌ జిల్లా చేగుంట మండలం బోనాల వద్ద మిషన్‌భగీరథ పైపులైన్‌కు రంధ్రం ఏర్పడింది. దీంతో నీరంతా ఎగిసిపడి వృథాగా పోయింది. ఈ విషయాన్ని ‘న్యూస్‌టుడే’ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నీటి సరఫరా నిలిపివేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టారు

ఇదేమిటి రైలు నీటిపై తేలుతూ వెళ్తోందని ఆశ్చర్యపోతున్నారు కదూ.. ఈ చిత్రం వరంగల్‌ జిల్లా కాజీపేట వడ్డేపల్లి చెరువు వద్ద తీసినది. చెరువు నిండుగా ఉండటంతో వెనుక పట్టాల వరకు నీరు చేరింది. వరంగల్‌ వైపు నుంచి న్యూ దిల్లీకి రైలు వెళ్తుండగా.. చెరువు ఇటువైపు నుంచి తీసిన చిత్రమిది.  

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థులు తమ చిత్రాల్లో బంధించారు. ఉపాధికి ఎదురయ్యే ఇక్కట్లు, మధ్యతరగతి వర్గాలు ఎదుర్కొనే సవాళ్లు, ప్రకృతి ఎలా నాశనం అవుతుందో తమ చిత్రాల్లో చక్కగా చెప్పారు.

ఐటీ సంస్థలు సాయంత్రం నాలుగు గంటల నుంచే కార్యకలాపాలను ముగిస్తుండటంతో అప్పటినుంచే రోడ్లపై వాహనాల రద్దీ మొదలైపోతోంది. హైదరాబాద్‌లోని రహెజా మైండ్‌ స్పేస్‌ నుంచి సైబర్‌టవర్స్‌ కూకట్‌పల్లి వైపు రద్దీతో నిలిచిన వాహనాలివి.

చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌ జంతు ప్రదర్శనశాలలో ఈ నెల 1న పుట్టిన చైనీస్‌ అలుగు(పాంగోలిన్‌) ఇది. గత రెండేళ్లలో అక్కడ పుట్టిన రెండో అలుగు ఇదే కావడం విశేషం. అంతరించిపోతున్న వీటి జాతిని పరిరక్షించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని జనాభా పరిశోధన కేంద్రంలో గతేడాది డిజిటల్‌ బోర్డులు ఏర్పాటుచేశారు. దేశం, రాష్ట్ర జనాభా ఎంతనే వివరాలు ఎప్పటికప్పుడు వీటిపై కనిపిస్తుంటాయి. ఈ నెల 11న జనాభా దినోత్సవం నేపథ్యంలో డిజిటల్‌ తెరలపై కనిపించిన అంకెలివి. 

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉండగా తాడేపల్లిలోని తన నివాసం వైపు రహదారిపైకి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించమే కాకుండా పట్టణ సుందరీకరణ నిధుల నుంచి రూ.లక్షలు వెచ్చించి పనులు చేయించారు.

ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యుడు, సిబ్బంది ఛాతీ లోతులో ప్రవహిస్తున్న వాగులను దాటారు. మూడు ఎత్తయిన గుట్టలను ఎక్కి దిగుతూ వెళ్లి 16 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామస్థులకు వైద్యసేవలు అందించారు

నెల్లూరు బారాషహీద్‌ దర్గా ఆవరణలో రొట్టెల పండగకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వర్ణాల చెరువు వద్ద బారికేడ్లు, విద్యుత్తు దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు.  

వానాకాలం మొదలై నెల రోజులు దాటినా సరైన వర్షాలు లేక వనరుల్లో నీరు అడుగంటుతోంది. పెద్దపల్లి నుంచి నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాలకు వెళ్లే రహదారికి ఇరువైపులా పొలాలు బీడుగా కనిపిస్తున్నాయి. దుక్కులు దున్నాల్సిన రైతులు పొలాల్లో పశువులను మేపుతూ కనిపించారు.

విశాఖ జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో సీతాఫలాలు ఈ ఏడాది ముందుగానే వచ్చేశాయి. సాధారణంగా ఏటా జులై చివరి వారం నుంచి వస్తుంటాయి. ఈ ఏడాది మాత్రం మొదటి వారం నుంచే రావడంతో పాటు వంద కాయల బుట్ట రూ.500 పలకడంతో గిరిజన రైతులకు కాసుల పంట పండుతోంది.

అందంలో ఇదే తారస్థాయి

చిత్రం చెప్పే విశేషాలు (18-07-2024)

చిత్రం చెప్పే విశేషాలు (17-07-2024)

Eenadu.net Home