చిత్రం చెప్పే విశేషాలు
(10-04-2023/1)
జమ్మూ-కశ్మీర్‌లోని గాందర్‌బల్ బాల్తాల్ ప్రాంతంలో ఆసియాలోనే అతి పొడవైన జోజిలా టన్నెల్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 14.2 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గంలో 6 కి.మీ. పనులు పూర్తయ్యాయి. 2026 నాటికి ఈ సొరంగం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
Source:Eenadu
అదేంటి జింక బుడతడి వెంట పరుగెడుతోందని అనుకుంటున్నారా.. బాలుడి పరుగు నిజమే కానీ.. జింక మాత్రం ప్రాణమున్నది కాదు.. గోడపై గీసిన బొమ్మ. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో హరిణవనస్థలి పార్కు ముందు గోడపై ఉన్న కృష్ణజింక బొమ్మ ముందు ఓ బాలుడు పరిగెడుతుండగా తీసిన చిత్రమిది.
Source:Eenadu
గత ఆదివారం ఫన్‌డే పేరుతో ట్రాఫిక్ మళ్లించి వివిధ కార్యక్రమాలు చేపట్టగా ప్రస్తుతం ట్యాంక్‌బండ్‌పై ఆపిన ప్రతీ వాహనాన్నీ ఇలా ఫొటోలు తీస్తూ అప్‌లోడ్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అంటే చలానాల వాత తప్పదన్న మాట.
Source:Eenadu
గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘శారీ వాకథాన్’లో పాల్గొన్న మహిళలు.
Source:Eenadu
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్ ఆసుపత్రిలో ఆత్యాధునిక వసతులు, అభివృద్ధి పనులను ఇటీవల ప్రారంభించారు. ప్రాంగణంలో ఇనుప వాచర్లు, నట్లతో ఏర్పాటుచేసిన యోగా సాధన ఆకృతులు ఇక్కడికి వచ్చే రోగులు, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
Source:Eenadu
ఎండలు ఠారెత్తిస్తుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరైతే గొడుగులను ఆశ్రయిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో యువతులు గొడుగుల నీడలో వెళ్తూ కనిపించారిలా..
Source:Eenadu
సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ తిరుమల శ్రీవారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో సీఎస్ జవహర్‌రెడ్డి చేతులమీదుగా ఈవో ధర్మారెడ్డికి అందించారు.
Source:Eenadu
కృష్ణా జిల్లా నాగాయలంకలోని తలసిల వెంకట చలపతిరావు ఇంటి పెరట్లోని పనస చెట్టు విరగ్గాసింది. ఆరేళ్ల కిందట పనస మొక్క నాటారు. మూడేళ్ల నుంచి కాస్తోంది. ఈ ఏడాది ఊహించని విధంగా 170కి పైగా పిందెలు వేయగా.. ప్రస్తుతం 120కి పైగా కాయలున్నాయి.
Source:Eenadu
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం రేవణపల్లి గ్రామంలో మూసీ నీటితో నిండిన చెరువులో గ్రామస్థులు తమ పొలాలకు సుమారు 39 మోటార్లను చెరువు గట్టుపై ఏర్పాటు చేసుకుని పంటలు పండిస్తున్నారు.
Source:Eenadu
వరంగల్ నగరంలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో వసంతోత్సవాలు మిన్నంటాయి. మూడు రోజుల పాటు సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాగి నిట్ క్రీడా మైదానంలో ఆదివారం ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
Source:Eenadu